కేసీఆర్ తరహాలో జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దపడుతున్నాడా.. ?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది. మొన్నటి క్యాబినెట్ భేటీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కొన్ని సంకేతాలు ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చాయి. వచ్చే ఏడాది నుంచి నేతలంతా ప్రజల్లో ఉండాలని.. తాను కూడా వచ్చే ఏడాది నుంచి ప్రజలతోనే ఉంటానని మంత్రులతో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

వచ్చే ఏడాది నుంచి పీకే టీమ్ కూడా వైసీపీ తరఫున రంగంలోకి దిగబోతోందని జగన్ వెల్లడించారు. దాంతో జగన్మోహన్ రెడ్డి 2024 లో కాకుండా 2023 లోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారన్న చర్చ ఊపందుకుంది. ఇంకా సగం పదవీ కాలం కూడా ముగియకముందే జగన్మోహన్ రెడ్డి ఈ సంకేతాలివ్వడం బట్టి గతంలో కెసిఆర్ ఫాలో అయిన వ్యూహాన్ని జగన్ అమలు చేయబోతున్నారా అన్న భావన వ్యక్తమవుతోంది.

ముందస్తు ఎన్నికల వ్యూహం ఫలిస్తుందా ..

2014లోనూ తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఏడాది ముందే అంటే 2018 లోనే పూర్తిచేసుకుని భారీ విజయం సాధించారు. ఆ వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్ కు ఒక విధంగా చేదు ఫలితాలే వచ్చాయి. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే జాతీయ అంశాలు కూడా ప్రభావం చూపి ఫలితాన్ని తారుమారు చేస్తాయన్న కేసీఆర్ అంచనా దాదాపు నిజమైంది.

ఇప్పుడు జగన్ కూడా లోక్ సభ ఎన్నికలతో పాటుగా కాకుండా కాస్త ముందస్తు ఎన్నికలకు (అసెంబ్లీ) వెళితే.. ఏపీలో తాము అమలు చేసిన పథకాలను మీదే ప్రజలు తీర్పు ఇస్తారు అన్న భావనతో ఉండి ఉండవచ్చు. లోక్సభ తో పాటుగా అయితే జాతీయస్థాయి అంశాలు, కేంద్రంలో కూటములు వంటి అంశాలన్నీ ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రశాంత్ కిశోర్ వ్యూహాకర్తగా సిద్దమేనా

2023 లో ఎన్నికలు ఎదుర్కోవాలంటే అంతకుముందు ఏడాది నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నది జగన్ ఆలోచన గా కనిపిస్తుంది. పీకే టీమ్ ను రంగంలోకి దింపి, వారి ద్వారా నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకొని.. అందుకు తగ్గట్టు మార్పులు-చేర్పులు, సర్దుబాటు చేసే యోచనలో జగన్ ఉన్నట్లు భావిస్తున్నారు. పైగా ఏపీలో ప్రతిపక్షం ఇంక ఏమాత్రం కోలుకోలేదు. ప్రతిపక్షానికి మరింత సమయం దొరక్కుండా తక్షణం మరో దెబ్బ కొట్టవచ్చిన్న ఆలోచన కూడా జగన్ చేస్తుండవచ్చు.

లోకేశ్ నాయకత్వం పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసహనం..!

అన్నిటికి మించి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి భారీ విజయం సాధిస్తే.. లోక్సభ ఎన్నికల్లో పైచేయి సాధించడం మరింత ఈజీ అవుతుంది అన్న భావన కూడా వైసీపీలో ఉంది. దాంతో పాటు జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో టీడీపీ తన వ్యవస్థల్లోని బలాన్ని ప్రదర్శిస్తోంది అన్న భావన వైసీపీలో బలంగా ఉంది. మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి టిడిపిని ఓడిస్తే ఇక అటువైపు నుంచి కూడా పెద్దగా అడ్డంకులు ఎదురు కాకపోవచ్చు. ఈ కారణాలతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

1 thought on “కేసీఆర్ తరహాలో జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దపడుతున్నాడా.. ?”

Leave a Comment