తెలంగాణలో పార్టీ స్థాపనకు ముందే చిక్కుల్లో పడిన వైఎస్ షర్మిల..!

తెలంగాణలో తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్న వైయస్ షర్మిల కు పార్టీని స్థాపించక ముందే పరీక్ష ఎదురవుతోంది. కీలకమైన అంశాల్లో తన వైఖరి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో షర్మిల ఎలాంటి వైఖరి అవలంబిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తోంది. కృష్ణా నీటిని రాయలసీమకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల పైన తెలంగాణ ప్రభుత్వం భగ్గుమంటోంది. తెలంగాణలోని విపక్షాలు వేర్వేరుగా ప్రకటనలు ఇస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి.

మరి షర్మిల ఈ విషయంపై ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో పార్టీలన్నీ తన అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనేది తెలంగాణ నేతల ఆరోపణ.

పార్టీ తెలంగాణ కే పరిమితం

కేవలం తెలంగాణలోనే పార్టీని స్థాపించి నడిపించాలి అని అనుకుంటున్న షర్మిల, తెలంగాణలోని మిగతా పార్టీల మాదిరిగా జగన్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే జగన్ ఈ ప్రాజెక్టును చేపడుతున్నది రాయలసీమ ప్రజల బాగు కోసమే. సాగునీరు లేక కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమను ఆదుకోవాలని జగన్ తాపత్రయపడుతున్నారు. రాయలసీమ కరువు గురించి ఆ ప్రాంతంలో పుట్టిన షర్మిలకు కూడా బాగా తెలుసు.

మరోవైపు తెలంగాణకు ఈ ప్రాజెక్టు ద్వారా నష్టం జరుగుతుందన్న అంచనాలు.. అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు షర్మిల ఎవరి వైపు ఉంటారనేది చూడాల్సి ఉంటుంది. తెలంగాణతో తన రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉందని షర్మిల నమ్మకంగా ఉన్నారు కాబట్టి కచ్చితంగా జగన్ ప్రభుత్వ విధానాన్ని షర్మిల తప్పుపట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి షర్మిల ఆ పని చేస్తారా అనేది చూడాలి. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా షర్మిల మాట్లాడితే తన కుటుంబాన్ని నమ్మి అండగా ఉంటున్న రాయలసీమకు వ్యతిరేకిగా ముద్ర పడతారు. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కుంటారో వేచి చూడాల్సి ఉంటుంది.

మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేశారని ఇప్పుడు టిఆర్ఎస్ తన వాదనను మరోసారి తెరపైకి తెచ్చి ఆయనను తీవ్రంగా విమర్శిస్తోంది. దీనిపై కూడా షర్మిల స్పందించి తన తండ్రి తెలంగాణకు అన్యాయం చేయలేదని తెలంగాణకు మేలు చేశారని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు షర్మిల పైనే ఉంది. ఏది ఏమైనా తాను తీసుకోబోయే నిర్ణయంపై తన తెలంగాణ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందనే చెప్పాలి.

Leave a Comment