విశాఖ స్టీల్ ప్లాంట్ పై 20 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.. లేఖలో వైఎస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కి మరోసారి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని.. కేంద్రానికి వున్న 100 శాతం వాటాని అమ్మేస్తామని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోడీకి జగన్ మరోసారి లేఖ రాశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో అఖిలపక్షం నేతలను, కార్మిక సంఘాల నాయకులను ఢిల్లీకి తీసుకొస్తామని లేఖలో వివరించారు. అఖిలపక్ష నేతలు, కార్మిక సంఘాలతో పాటు వచ్చి కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని జగన్ కోరారు. స్వయంగా తానే అఖిలపక్షం నాయకులను, కార్మిక సంఘాలను వెంటబెట్టుకుని వస్తానని వివరించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన సంస్థ అని లేఖలో గుర్తు చేశారు. ప్లాంట్ సాధన కోసం ప్రజలు దశాబ్దానికి పైగా ఉద్యమించారని వివరించారు. ఆరేళ్ళ క్రితం వరకు ప్లాంట్ లాభాల్లోనే నడిచిందని లేఖలో తెలిపారు. ప్లాంట్ పై దృష్టి పెడితే కచ్చితంగా లాభాల్లోకి వస్తుందని జగన్ తన లేఖలో ధీమా వ్యక్తం చేశారు.

కరోనా తర్వాత ఆర్థిక రంగం తరహాలోనే స్టీల్ రంగంలోనూ V షేప్ రికవరీ ఉందని ముఖ్యమంత్రి వివరించారు. కరోనాకు మందు అలాగే ప్రస్తుతం ప్లాంట్లో 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని.. ఇది ఇలాగే కొనసాగితే మరో రెండేళ్లలోనే నష్టాలు పూర్తిగా మాయం అయ్యే అవకాశం ఉందని జగన్ వెల్లడించారు.

సొంత ఘనులు లేకపోవడం వల్లే ప్లాంట్ పై ఆర్థిక భారం పడుతోందని.. ఒడిశాలోని గనులను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలని కూడా లేఖలో ముఖ్యమంత్రి కోరారు. స్టీల్ ప్లాంట్ పై 20 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వివరించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన ప్రకటన ఆంధ్ర ప్రజలను, కార్మికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. కాబట్టి నిర్ణయాన్ని మార్చుకోవాలని, అఖిలపక్షం నేతలు కార్మిక సంఘాల నాయకులతో వచ్చి వాస్తవ పరిస్థితిని వివరించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని లేఖలో ముఖ్యమంత్రి కోరారు.

Leave a Comment