తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ జల వివాదం ముదురుతోంది. వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న సంగమేశ్వర ప్రాజెక్టుపై తెలంగాణ అధికార పార్టీ గరం గరంగా ఉంది. తమ కళ్ల ముందే ప్రాజెక్ట్ ని నిర్మించి నీటిని దోచుకుంటోంది అని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు ముదిరి కంట్రోల్ తప్పుతున్నాయి.
రెచ్చగొడుతున్న మంత్రుల వ్యాఖ్యలు
దివంగత సీఎం వైఎస్సార్, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డిలపై తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నీటి అక్రమ తరలింపులో జగన్ దొంగ అయితే వైయస్సార్ గజదొంగ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా తన క్యాబినెట్ మీటింగ్ లో జగన్ ను మూర్ఖుడు అని అన్నట్లు పచ్చ మీడియా విపరీత ప్రచారం కూడా చేసింది. ఇదే అదనుగా మరికొందరు తెలంగాణ నేతలు కూడా జగన్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
జగన్ పై తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై అటు వైఎస్సార్ పార్టీ నాయకులు, జగన్ అభిమానులు నిరసన చేస్తున్నారు. కానీ సీఎం వైయస్ జగన్ మాత్రం ఈ వ్యాఖ్యలపై అసలు స్పందించడం లేదు. ఈ విషయంపై ఆయన సైలెంట్ గా ఉండాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తూ ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
దీనికి అనుగుణంగానే నిన్నమొన్న వైఎస్ఆర్సిపి పార్టీలోని కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారు. అలాగే హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఏపీ ప్రజలు ఉద్యోగాలు చేస్తూ నివసిస్తున్నారు.
తెలంగాణ మంత్రులు మాట్లాడిన దానికంటే ఎక్కువగా ఏపీలోని మంత్రులు, మేము కూడా కౌంటర్ గా మాట్లాడితే మన మధ్యలో ఉన్న సోదర భావం చెడిపోతుంది.. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. అలా జరిగితే ప్రజల్లో వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సంయమనం పాటించండి
అందుకే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ జల వివాదంపై.. అలాగే తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్వరంతో మాట్లాడవద్దని పార్టీ నేతలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. తాను కొత్త ప్రాజెక్టులు కట్టినా కూడా, తమ వాటా నీరు అంతే వాడతామని, ఒక టీఎంసీ కూడా ఎక్కువ వాడుకోమని జగన్ అంటున్నారు. ఈ ఒక్క విషయం ఆధారంగానే ముందుకు వెళ్లాలని, ఏపీ కడుతున్న ప్రాజెక్టులతో తెలంగాణకు అన్యాయం జరగదనే విషయం మాట్లాడాలని తన మంత్రులును కూడా ఆదేశించారని అంతర్గత సమాచారం.
జల వివాదం రెండు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకుంటాయి. లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ.. కృష్ణా బోర్డు కానీ పరిష్కరిస్తుంది. అదీ జరగకుంటే కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ మొత్తం వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చూసుకుంటాయి. అంతే కానీ రాష్ట్ర ప్రజల గురించి ఇంకో రాష్ట్ర మంత్రులు మాట్లాడితే ప్రజల మధ్య దూరం ఏర్పడుతుంది. రాష్ట్ర విభజన జరిగినా కూడా తెలుగు ప్రజలు కలిసి జీవిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగాలని వైయస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఇదే సమయంలో తన ప్రాజెక్టులపై ముందుకెళ్లాలని.. ఇందుకు సంబంధించి వ్యూహాత్మకంగా నడుచుకోవాలని జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే తెలంగాణ మంత్రులు తనని తిడుతున్నా.. కెసిఆర్ తన గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసినా.. వైయస్ జగన్ సహనంతో ఉంటున్నారు. కానీ ముందు ముందు వైయస్ జగన్ తీసుకోబోయే నిర్ణయం పై ఏపీ ప్రజలలో సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.