వైయస్ షర్మిల గారు తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని నేరుగా ఇప్పటి వరకు కలవలేదు. కనీసం కుటుంబ కార్యక్రమాల్లో కూడా పాల్గొన లేదు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇడుపులపాయ వేదికగా వైయస్ జగన్, షర్మిల
జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జగన్, షర్మిల భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూలై ఎనిమిదో తారీకున షర్మిల గారి కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్నారు. పార్టీ ప్రకటన అనంతరం తండ్రి సమాధి వద్ద ఆశీస్సుల కోసం షర్మిల ఇడుపులపాయకు రానున్నారు. ఇక్కడ జగన్ గారు షర్మిల గారు సమావేశం అవుతారని వార్తలు వస్తున్నాయి. ( చిక్కుల్లో పడిన వైఎస్ షర్మిల..! )
అదేరోజు రైతు దినోత్సవం జరపాలని ఏపీ సర్కార్ ఆ మేరకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే సీఎం జగన్ గారు జూలై 7 నుంచి 9 వరకు కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. కీలక రాజకీయ పరిణామాల అనంతరం జగన్, షర్మిల కలయిక రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేపనుంది.
షర్మిల కొత్త పార్టీ వ్యవహారం వెనుక రకరకాల రాజకీయ కోణాలు కమ్ముకున్న నేపథ్యంలో వీరి కలయిక పొలిటికల్ సర్కిల్స్లో వేడి పుట్టిస్తుందనే చెప్పాలి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేస్తున్న జల వివాదం పై తెలంగాణకు షర్మిల మద్దతు పలకడంతో వీరి మధ్య భేటీ ఎటువైపుకు దారితీస్తుందో చూడాలి.