ఏపీలో అదే జరగబోతోందా.. !!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల తర్వాత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పార్టీ తెలుగుదేశం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా వారిలో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు చంద్రబాబు.

2019 ఎన్నికల్లో టీడీపీకి సరిగ్గా ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. అనూహ్యంగా విజయనగరం, నెల్లూరు, కడప జిల్లాలో టీడీపీకి కనీసం ఒక్క స్థానం కూడా దక్కలేదు. గతంలో తనను తీవ్ర ఇబ్బందులు పెట్టిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి నిద్ర లేకుండా చేసేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం టీడీపీకి ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదాను పోగొట్టడమే ఏకైక ఎజెండాగా జగన్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈమేరకు పెద్దఎత్తున టిడిపి నాయకులను వైసీపీలో చేర్చుకునే కార్యక్రమానికి జగన్ తెరతీశాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే పెద్ద ఎత్తున నాయకులు వైసీపీలో చేరారు. కొద్దిరోజుల పాటు చేరికలకు బ్రేక్ వేసిన జగన్, ఇప్పుడు ప్రజా ప్రతినిధులు చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నిబంధనలు ఉన్నాయా

తమ పార్టీలోకి ఎవరు చేరాలనుకున్నా వారి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరాలి అంటూ మొదటి నుండి షరతులు విధించారు. అయితే ఇప్పుడు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా చేరికలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో వలసల జోరు పెరిగింది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసిపికి మద్దతు పలికారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ ఇప్పటికే వైసీపీకి జై కొట్టారు.

ఇదే సమయంలో మరికొందరు టీడీపీ నేతలు కూడా వైసిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వాసుపల్లి గణేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. మరింత మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారా, ఎవరెవరు వెళ్తారు అన్న టెన్షన్ ప్రస్తుతం టీడీపీ నేతల్లో నెలకొంది. విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలోనే వైసీపీలో చేరుతున్నారనే సమాచారం టిడిపిలో మరింత ఆందోళన పెంచుతోంది.

ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, గణబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ముందుగా వీరే పార్టీ మారుతారు అన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉండటంతో విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు,గణబాబు వైసీపీ కి జై నాఎందుకు సిద్ధంగా వున్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో టిడిపికి రాజకీయంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొంతుందని జగన్ అంచనా వేస్తున్నారు. అదే జరిగితే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోయే ప్రమాదం కూడా ఉంది.

Leave a Comment