వారి పోరాట స్ఫూర్తిని అభినందించాల్సిందే..

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో తమకు ఇక తిరుగులేదన్న ధీమా కనిపించేది. ఉమ్మడి ఏపీని యేలిన తనకు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను ఆడించడం ఏమంత కష్టం కాదన్న అభిప్రాయం చంద్రబాబులో కనిపించేది. ఏపీ శాశ్వతంగా తమ సొంతమని అన్నట్టుగా టీడీపీ వ్యవహారం ఉండేది.

అయితే ఈసారి ఎన్నికల్లో దారుణమైన ఓటమితో టిడిపి కంపించిపోయింది. అదే సమయంలో మాహిష్మతిగా టీడీపీ పెద్దలు భావించిన అమరావతి విషయంలోనూ ఈ ప్రభుత్వం మార్పులకు దిగడంతో టిడిపి చంద్రబాబు నాయుడు వెంట ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలలోని వ్యక్తులు ఇప్పుడు తెగించి పోరాటం సాగిస్తున్నారు.

టీడీపీ మీడియా సంగతి తీసుకుంటే వారి పోరాట స్ఫూర్తిని అభినందించాల్సిందే. హద్దులు చెరిపేసుకుని టీడీపీ మీడియా సంస్థలన్నీ జగన్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడమే ఏకైక ఎజెండాగా ముందుకు వెళ్తున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వారికి మరింత ఆజ్యం పోసి తమ మీడియా ద్వారా విపరీతమైన ప్రాచుర్యం కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం పై కాలుదువ్వుతోంది టీడీపీ మీడియా. చర్చలు, కథలు, కథనాలు, కామెంట్లు ఇలా ప్రతి దాంట్లోనూ జగన్ వ్యతిరేక వాదనను వినిపిస్తూ వస్తున్నాయి.

ఏపీలో లేని అలజడిని ఈ మీడియా ఉన్నట్లు చూపిస్తోంది. గతంలో పలుమార్లు చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించినా, తిరిగి మీడియా సాయంతోనే ఆయన రాజ్యస్థాపన చేయగలిగారు. ఇప్పుడు ఆ పనిని మీడియా మరింత శ్రద్ధగా చేస్తోంది. ఇటు వైసీపీ మీడియా తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. టీడీపీ మీడియా రంకెలేస్తుంటే ఇటు వైసీపీ మీడియా మాత్రం అతి కోమలత్వంతో కనిపిస్తోంది.

వైసీపీ ప్రధాన మీడియా ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాస్త చురుగ్గా పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. వాదనకు ప్రతిపాదన తప్పనిసరిగా ఉంటుంది. తమకు అనుకూలమైన వాదనను టీడీపీ మీడియా ఛానల్ లో నిమిషాల వ్యవధిలో ప్రసారం చేస్తూ తమ వాదనదే పైచేయి అనే భవనాలు కలిగిస్తున్నాయి. ఇటువైపు వాదన ఏంటో వినిపించడంలో వైసిపి మీడియాకు నిరుత్సాహం ఆవరించినట్లుగా కనిపిస్తోంది.

టీడీపీ మీడియా అతి వేగంగా వారికి అనుకూలమైన వాదాన్ని ప్రచారం చేస్తుండడంతో.. వందలాది వెబ్ మీడియాలు కూడా టీడీపీ వాదననే వేగంగా ప్రచారంలోనికి తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని గుర్తిస్తే దానికి విరుగుడు కోసం శ్రమించాల్సి వస్తుంది అన్న భావనతో ఉన్నారో ఏమో గాని జగన్ బృందం సభ్యులు సింపుల్ గా టిడిపి మీడియాకు ప్రజల్లో విశ్వసనీయత లేదు అంటూ వెళ్ళిపోతున్నారు.

నిత్యం ప్రతిపక్షం చాలా అంశాలపై అసత్య ప్రచారం చేస్తున్నా కనీసం వాటిని గుర్తించే వ్యవస్థ కూడా వైసిపి వద్దగాని,ప్రభుత్వం వద్దగాని ఉన్నట్లుగా కనిపించడం లేదు. మనకు సోషల్ మీడియా ఉందని వైసీపీ పెద్దలు గొప్పలు చెప్పుకుంటారు కానీ సోషల్ మీడియాలో తమ పాత్ర యెంత వరకు వున్నది అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.

తమ శాఖలపై వచ్చే ప్రతికూల కథనాన్ని ఖండించే తీరిక ఏ కొద్దిమంది మినహా మిగిలిన వారికి కూడా ఉండడం లేదు. వైసిపి ప్రజాప్రతినిధులంతా కేవలం వారి పత్రిక మాత్రమే చదువుకొని అంతా సవ్యంగానే ఉందని సంతోషపడుతున్నారో ఏమో.. ఇలాంటి ప్రతికూల అంశాలను నెత్తిన వేసుకొని కూడా చంద్రబాబు పురాతన పునాదుల్ని కదిలించేందుకు జగన్ ముందుకెళ్లడం గొప్ప విషయమే అవుతుంది.

Leave a Comment