కేంద్రంపై పొలిటికల్ ఫైట్ ప్రారంభించిన వైసీపీ ఎంపీలు.. తెరపైకి ప్రత్యేక హోదా..!

ప్రత్యేక హోదా నినాదాన్ని పార్లమెంట్ సాక్షిగా వైసీపీ మళ్లీ తెరపైకి తీసుకురావడంతో కేంద్రంపై పొలిటికల్ ఫైట్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. కేంద్రంలో బీజేపీకి ఎక్కువ మంది ఎంపీలు రావడంతో వారిని అడగడం తప్ప గట్టిగా నిలదీసే పరిస్థితులు కనిపించడంలేదని ప్రత్యేక హోదా విషయంలో గతంలో సీఎం జగన్ చెప్పారు. కేంద్రం ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని పదే పదే చెబుతూ వస్తుంది. దీంతో జగన్ మరియు వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వారికి విన్నవించుకోవడంతో సరిపోతోంది.

రూట్ మార్చిన వైసీపీ

తాజాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో హోదా నినాదాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో ఒకరకంగా చర్చ మొదలైంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ప్రధాని మోదికి మద్దతుగా సీఎం జగన్ నిలబడటం జరిగింది. ఆ సందర్భంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రానికి అండగా నిలవడంతో కలిసి రావాలంటూ లేఖలు రాశారు. అలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలే సనిపించాయి.

ఈమధ్యనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదంలో ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతో దాని ఆధారంగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ పరిస్థితి అనూహ్యంగా మారింది. వైసీపీ తన ట్రాక్ చేంజ్ చేసి ఇప్పుడు కేంద్రంపై దూకుడు పెంచింది. మొన్నామధ్య ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మంత్రి కొడాలి నాని మరో అడుగు ముందుకేసి టీడీపీని బీజీపీలో విలీనం చేస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. దీంతో కేంద్రంతో వైఖరి విషయంలో వైసీపీ అనుసరించబోయే విధానం మార్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పొలిటికల్ ఫైట్ లో ఏదైనా మతలబు వుందా

ఇప్పటివరకు హోదా విషయంలో సంయమనం పాటిస్తూ వస్తున్న వైసీపీ ఇప్పుడు కేంద్రంతో పోరాటానికి సిద్ధమైంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చకు అనుమతి ఇవ్వాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు ఇచ్చారు. నిబంధనలలోని రూల్‌ 267 కింద ఆయన ఈ నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఛైర్మన్‌ పోడియం దగ్గరకు దూసుకెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఉన్నప్పుడే నిరసన తెలపడం విశేషం. ( రాహుల్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ )

ఎంపీల ఆందోళనల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. ఉభయ సభలలోను వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ నినాదలు చేయడంతో సభ గందరగోళంగా మారింది. ఇవన్నీ చూస్తుంటే, బీజేపీకి – వైసీపీకి మధ్య సంబంధాలు ఏమైనా బెడిసికొట్టాయా అన్న ప్రచారం మొదలైంది. దీనికి ఇటీవల విజయసాయి రెడ్డి, మంత్రి కొడాలి చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో ముఖ్యకారణం కూడా వుంది. ఎంపీ రఘురామ రాజు విషయంలో స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. మొత్తానికి ఈ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయా లేక ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీలు నిరసనలతో సభను స్తంభింపచేస్తారా చూడాలి.

Leave a Comment