ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి తీరుపై ఎంపీ విజయ సాయిరెడ్డి అసంతృప్తి..

రాజ్యసభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ వేదికగా వైసిపి ఎంపీలు ఆందోళన చేశారు. ఆ సమయంలో వెంకయ్య నాయుడు తీరుపైనా వైసిపి ఎంపీలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను విజయసాయిరెడ్డి లేవనెత్తగా వెంకయ్యనాయుడు తోసిపుచ్చడంతో వివాదం ఏర్పడింది. విషయాన్ని వివరించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో వైసీపీ ఎంపీలు పోడియం వద్దకు వెళ్లారు.

ఈ సమయంలోనే వెంకయ్య నాయుడును ఉద్దేశించి విజయసాయిరెడ్డి కొన్ని విమర్శలు చేశారు. మీ మనసు బీజేపీతో తనువు టిడిపితో ఉన్నట్టు వెంకయ్య నాయుడును ఉద్దేశించి విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 4వ తేదీన రాజ్యసభలో మాట్లాడిన టీడీపీ ఎంపీ కనకమేడల తన ప్రసంగంలో ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజ్యసభలో వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి ఎందుకు తొలగించలేదని విజయ సాయిరెడ్డి ప్రశ్నిచారు. వాటిని సభాపతి ఎలా అనుమతిస్తారు అంటూ వెంకయ్యనాయుడును నిలదీశారు.

సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తుతుండగానే మైక్ కట్ చేయడంతో వైసిపి ఎంపీలు పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఆ తర్వాత ఇదే అంశంపై వెంకయ్యనాయుడుకు విజయసాయిరెడ్డి లేఖ కూడా రాశారు.

ఇటీవల టీడీపీకి చెందిన ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో మత ఘర్షణలు జరుగుతున్నాయి అంటూ అందుకు సాక్ష్యంగా 2016-17 మధ్యలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ఒక వీడియో క్లిప్ ను హోంమంత్రికి చూపించారని.. ఇలా చేయడం ద్వారా కేంద్ర హోంమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వంను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని విజయ సాయిరెడ్డి లేఖలో వివరించారు.

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వీడియో 2017 సంవత్సరం నాటిదని.. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని.. కానీ ఆ విషయాన్ని దాచి పెట్టి హోం మంత్రికి ఫిర్యాదు చేశారని టీడీపీ ఎంపీలపై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.

రాజ్యసభలోనూ అదే తరహాలో కనకమేడల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగించారని, వీరి తీరు చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు గా ఉందని విజయ్ సాయి రెడ్డి ఆరోపించారు. కనకమేడల చేసిన అనుచిత ప్రసంగం రాజ్యసభ నిబంధనలకు విరుద్ధమని, దాన్ని రికార్డుల నుంచి తొలగించడంతో పాటు కనకమేడల పై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి తన లేఖలో డిమాండ్ చేశారు.

నీ మనసు బిజెపితో తనువు టిడిపితో ఉందంటూ విజయసాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని సభలో వెంకయ్య నాయుడు చెప్పారు. తనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన వెంటనే తాను బిజెపికి రాజీనామా చేశానని.. ఆ తర్వాత ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదని వివరణ ఇచ్చారు.

Leave a Comment