ఇప్పుడు గుర్తుకు వచ్చానా ..!!

ఒకప్పుడు ఆయనతో పెద్దగా అవసరం లేదని భావించారు. పదవులకు దూరం పెట్టారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో పాటు మంత్రిగా పనిచేసిన సీనియర్‌. అయినా మంత్రివర్గంలో చోటివ్వలేదు. పైగా జిల్లాలోనూ ఆయన మాటకు విలువ లేకుండా చేశారు. కానీ, ఆయనే ఇప్పుడు అవసరం అయ్యాడు. తమపై గుర్రుగా ఉన్న ఆయనను తమ దారిలోకి తెచ్చుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారు.

ఇంతకీ ఎవరాయన.. ఏమిటా కథ అంటారా.. అదేనండి ఏపీలోని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఆయన ఇటీవల కాలంలో వైసీపీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. అయితే, ఆనం రామనారాయణరెడ్డితో ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి పెద్దపనే పడింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటంతో ఆనం ఇప్పుడు వైసీపీ హైకమాండ్‌ స్పెషల్‌ లుక్స్‌లోకి వచ్చారంటున్నారు.

( మా బాబు గారికి ఏమైంది ..!! )

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం కూడా ఉంది. రామనారాయణరెడ్డి పదిహేను నెలల నుంచి పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. రామనారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడమే కారణమన్నది అందరికీ తెలిసిందే.

మంత్రి పదవి దక్కక పోవడంతో పాటు జిల్లాలోనూ ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. కనీసం తన వెంకటగిరి నియోజకవర్గంలోనూ పనులు జరగడం లేదని జిల్లా సమీక్ష సమావేశంలోనే ఆనం రామనారాయణరెడ్డి తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. ఇక వీఆర్‌ కళాశాల మేనేజ్‌మెంట్‌ కమిటీ వ్యవహారంలోనూ ఆనం రామనారాయణరెడ్డి గుర్రుగా ఉన్నారు.

మంత్రి అనిల్‌ కుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వీఆర్‌ కళాశాల వ్యవహారంలో తలదూర్చారన్న కోపంతో రగిలిపోతున్నారు ఆనం. దీంతో పాటు తన సీనియారిటీని కూడా జూనియర్‌ నేతలు పట్టించుకోవడం లేదని ఏకంగా వారిపై మాఫియా ముద్రను వేయబోయారు. దీనిపై పార్టీ అధిష్టానం ఆనంకు షోకాజ్‌ నోటీసు ఇచ్చేంత వరకూ వెళ్లింది. దీంతో ఆయన పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అధిష్టానానికి తన అవసరం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టే ఆయనతో వైసీపీ అధిష్టానానికి పనిబడింది.

( అంతా నేనే అనుకుంటే ఇలాగే ఉంటది మరి.. )

తిరుపతి ఉప ఎన్నికలో ఆనం కూడా కీలకంగా మారనున్నారు. తన నియోజవర్గ పరిధిలో జరగనున్న ఎన్నికతో ఆయనకు రానున్న కాలంలో పార్టీలో ప్రయారిటీ పెరుగుతుందంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి కూడా ఈ ఉప ఎన్నికను అడ్డం పెట్టుకుని తన డిమాండ్లను హైకమాండ్‌ ద్వారా నెరవేర్చుకునే లక్ష్యంతోనే ఉన్నట్లు కనపడుతుంది. మొత్తం మీద ఆనం రామనారాయణరెడ్డితో అధిష్టానానికి పెద్దపని పడిందనే చెప్పాలి.

అయితే, పార్టీ తనను పట్టించుకోలేదని రగిలిపోతున్న ఆనంను దారికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. ఒకవేళ ఆయన ఈ ఉప ఎన్నికల్లో పార్టీకి సహకరించకపోతే పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో అధిష్టానం ఉన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

Leave a Comment