మీరు తప్ప మాకు వేరే దారి లేదుగా ..!

ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కేంద్రంలో బీజేపీకే సహకరిస్తూ వస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచే టీడీపీని టార్గెట్‌ చేస్తూ వస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ అండగా నిలిచిందన్న ప్రచారం జోరుగా సాగింది. టీడీపీ బీజేపీకి దూరమైన తర్వాత ఆ స్థానాన్ని వైసీపీ భర్తీ చేస్తోందన్న వాదనలు కూడా వచ్చాయి. కానీ, ఎక్కడా ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నట్టు ప్రకటించలేదు. కానీ, టీడీపీపై ఉన్న కోపంతో బీజేపీ జగన్‌కు దగ్గరయినట్టుగా ప్రచారం సాగింది.

ప్రస్తుతం కూడా ఆ రెండు పార్టీలు అంటకాగుతున్నాయని, అందుకే మూడు రాజధానులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు లాంటి అనేక విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. అయితే, ఏపీలో బలంగా ఉన్న రెండు పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఎవరి విధానాలు వారికున్నా కేంద్రంలో మాత్రం బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు.

కేంద్రంలో ప్రవేశపెట్టిన అనేక విషయాల్లో ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేస్తున్నారు. తాజాగా రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు పలికాయి. గత ఎన్నికలకు ముందు బీజేపీకి టీడీపీ దూరమైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో టీడీపీకి కూడా బాగా తెలిసివచ్చినట్టుంది.

బీజేపీతో పెట్టుకుంటే నష్టపోవాల్సి వస్తుందని భావించిన ఆ పార్టీ అధినేత వైఖరిలో మార్పు వచ్చిందని, అందుకే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే, బీజేపీ మాత్రం ఎవరిమీదో ఆధారపడడం ఎందుకని భావించిందని, ఏపీ, తెలంగాణలో తామే అధికారంలోకి వస్తే మంచిదనుకున్న నేతలు ఆ రెండు రాష్ట్రాలపై కన్నేశారు. దీనిలో భాగంగానే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కూడా బీజేపీ రాష్ట్ర శాఖలు ఒంటికాలుపై లేస్తున్నాయి. అయినా, ఏపీలో వైసీపీ, టీడీపీలు బీజేపీకి అనేక విషయాల్లో మద్దతు పలుకుతుండడం ఎవరికీ అర్ధం కావడం లేదని ఆ పార్టీల కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

మొత్తానికి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లి మనుగడ సాధించడం కష్టమనుకోవడం వల్లే టీడీపీ, వైసీపీలు ఆ పార్టీకి తప్పని పరిస్థితుల్లో మద్దతు పలుకుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా బీజేపీకే లాభం అన్న రీతిలో ఆ పార్టీ నేతలు కూడా ఉన్నట్టు సమాచారం. ఒక రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు బీజేపీకే మద్దతు ఇవ్వడాన్ని చూస్తుంటే ఈ రెండు పార్టీలు బీజేపీకి ఎప్పుడు దగ్గరవుదామా అన్న ఆతృతలో ఉన్నట్టు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Comment