ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన గణాంకాలతో మరోసారి హెచ్చరించింది. కరోనా మొదలు నుంచి ఇప్పటివరకు దాదాపుగా 10 లక్షల మంది వరకు చనిపోయారనీ, ఈ సంఖ్య మరింత పెరిగి 20 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొంది. అన్ని దేశాలు మేల్కొనకపోతే ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతారని గట్టిగా హెచ్చరించింది. ( ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ..)
ఈ హెచ్చరికలో భాగంగా వెంటనే కరోనాపై అన్ని దేశాలూ యుద్ధం ప్రకటించాలని సూచించింది. లేని పక్షంలో కరోనా తీవ్రత మరింతగా పెరిగి దాదాపు 20 లక్షల మంది వరకూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
తొలిసారిగా చైనాలోని వూహాన్ నగరం నుండి విస్తరించిన ఈ వ్యాధి, ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. గడిచిన 9 నెలల వ్యవధిలోనే 10 లక్షల మంది వరకూ కన్నుమూశారు. కేవలం ప్రభుత్వాలు మాత్రమే చర్యలు చేపడితే సరిపోదని, దీనికి ప్రజలు సైతం అప్రమత్తంగా వుండి వైరస్‌ను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ అన్నారు. (Bharat Bio-Tech)
ఈ పరిస్థితి చాలా ఆందోళనకరమని, ఈ వైరస్ తగ్గుముఖం పడుతుందన్న సూచనలు ఇంతవరకూ కనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుండగా, యూఎస్‌కు చెందిన Johnson & Johnson సంస్థ, తమ వ్యాక్సిన్ ఒక్క డోసు చాలని , దీనితో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో తయారవుతున్నాయని ప్రకటించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రయోగ దశలో వుంది.