వోకల్ ఫర్ లోకల్ .. దెబ్బకు చైనా ఢమాల్… !!

ఇంత కాలం మన పండుగలను సొమ్ము చేసుకున్న జిత్తులమారి చైనాకు భారత్ షాకిచ్చింది. సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ కంట్రీ తో ఇప్పటికే అన్ని రంగాల్లో భారత్ కట్ చేసుకుంటూ వస్తోంది. అటు అన్ని ఆర్థిక సంబంధాలు తెగదెంపులు చేసుకుంటూ వస్తుంది.

ఈ క్రమంలో చైనాకు భారత్ నుంచి దసరా, దీపావళి సెగ తగిలింది. ఈ దెబ్బతో చైనా ఏకంగా 40 వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. భారతీయులకు దసరా, దీపావళికి మించిన పండుగలు లేవు. ఈ రెండు పర్వదినాల సమయంలో చైనా నుంచి వేల కోట్ల రూపాయల విలువైన వస్తువులు భారత్ కు దిగుమతి అయ్యేవి.

china products

ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్ లే కాకుండా పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు, ఆకర్షణీయమైన రంగులు వెదజల్లే బాణసంచాలను సైతం చైనా సప్లై చేసి క్యాష్ చేసుకునేది. వాటి మీద పండగ ఆఫర్లు పెట్టి మరీ దోచుకునేది. దశాబ్దాల నుంచి మన పండుగలు చైనాకు సంబరాలు అన్నట్లుగా తయారైంది పరిస్థితి.

ఇక చైనా మేడ్ ఇన్ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఆట వస్తువుల వరకు, పూలు ప్రమిదలు నుంచి అలంకరణ సామాగ్రి వరకు, ఆభరణాలలు మొదలు టపాసుల వరకు ఏది కావాలన్నా ఢిల్లీ సదర్ బజార్ లో దొరకని వస్తువంటూ ఉండదు. భారత్లో చైనా మార్కెట్ అంతలా ఇమిడిపోయి ఉంది. మన దేశంలో తయారయ్యే వస్తువులతో పాటు విదేశీ వస్తువులను కూడా సదర్ బజార్ లో విక్రయిస్తారు.

వోకల్ ఫర్ లోకల్ .. మోదీ నినాదం

నిన్న మొన్నటి వరకు కూడా ఇక్కడ చైనా వస్తువులదే హవా. కానీ ప్రస్తుతం సీన్ మారింది. మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ దివాళీ పిలుపు బాగా పనిచేసింది. ప్రధాని పిలుపునకు భారత ప్రజలు బాగానే స్పందించారు. మన దేశంలోకి చైనా వస్తువులను రప్పించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలనే ఉద్దేశం గల చైనాకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదిక ద్వారా షాకిస్తూ దేశ ప్రజలకు ఒక పిలుపును కూడా ఇచ్చారు.

చైనా వస్తువులను బహిష్కరించాలని కోరారు. కేవలం మేడిన్ ఇండియా వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. మోదీ విజ్ఞప్తి తో ఢిల్లీ సదర్ బజార్ లో చైనా వస్తువులను బహిష్కరించారు. చైనా వస్తువులను సదర్ బజార్ వ్యాపారస్తులు పూర్తిగా నిషేధించారు. మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ను మాత్రమే విక్రయిస్తామని తేల్చి చెప్పేశారు. కష్టాలు వచ్చినా మన సంపద మనకే ఉండాలి అనే నినాదంతో చైనా బ్రాండ్ ను పక్కన పెట్టేశారు.

అటు కాంఫిడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ తీసుకొచ్చిన కఠిన చర్యలు కూడా చైనా మార్కెట్ ను కోలుకోలేని దెబ్బతీశాయి. కరోనా వైరస్ వ్యాప్తి, తూర్పు లఢఖ్ సరిహద్దు లో ఉద్రిక్తత నేపథ్యంలో చైనా ఉత్పత్తులు బహిష్కరించాలని అంటూ అంబానీ, టాటా, అజీమ్ ప్రేమ్జీ, మిట్టల్ వంటి దేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు కాంఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ట్రేడర్స్ గతంలో లేఖ రాసింది.

ఈ క్రమంలో భారత సైనికులను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ ఆర్మీ దురాగతాలను నిరసిస్తూ బ్యాన్ చైనా అంటూ సిఐటియు నిర్వహించిన ప్రచారం కూడా బాగా పనిచేసింది. సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ చైనా వంత పాడిన ప్రభావమో .. లేక ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మహత్యమో లేక సిఐటియు తీసుకున్న కఠిన నిర్ణయమో కానీ చైనా బాణాసంచా ఉత్పత్తులను భారతీయులు బాయ్ కాట్ చేశారు. దీంతో చైనా మార్కెట్ భారీగా నష్టపోయింది.

చైనా మార్కెట్ ఢమాల్

దీపావళి సీజన్లో భారత్లో 70 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే అందులో 40 వేల కోట్ల రూపాయల వ్యాపారం చైనా నుంచే జరుగుతోంది. ఈసారి చైనాకు వెళ్లాల్సిన ఆర్డర్లు అన్నీ కూడా ఆగిపోయాయి. ఈ దీపావళికి భారతీయ వ్యాపారులు తీసిన దెబ్బతో చైనాకు దిమ్మ తిరిగి పోయింది. తాజాగా దీపావళి బాణసంచా చైనా మార్కెట్లను భారీగా దెబ్బ తీసింది.

దేశంలోని ప్రధాన మార్కెట్లలో కలిపి ఈ సారి దీపావళి అమ్మకాలు 72 వేల కోట్ల రూపాయలు జరిగాయని కాంఫిడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. చైనా ఉత్పత్తులు బాయ్ కాట్ పిలుపు కారణంగా ఆ దేశానికి సుమారుగా 40 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు సిఐటియు జాతీయ అధ్యక్షుడు. దేశంలోని ప్రధాన 20 నగరాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు తెలిపారు.

దీపావళి పండుగ సీజన్లో అమ్మకాలు ఊపందుకోవడంతో చాలాచోట్ల వ్యాపారుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసిందని తెలిపారు. ఈ సీజన్లో ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ వస్తువులు, బొమ్మలు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు, కిచెన్ గిఫ్ట్ ఐటమ్స్ ,బంగారం, జ్యువెలరీ, ఫర్నిచర్ తదితర విభాగాల్లో అమ్మకాలు జోరుగా సాగాయన్నారు. ఈ ఏడాది జూన్లో ప్రారంభించిన చైనా వస్తువుల బహిష్కరణ నినాదం బాగానే పని చేసిందని తెలిపారు.

Indian markets

చైనా వస్తువులపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, చైనా వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తిని చూపడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక గతేడాదితో పోల్చితే ఈసారి లాభాలు కాస్త తగ్గినా స్వదేశే వస్తువులు అమ్ముడుపోవడం పై వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చైనా బ్రాండ్ ను పూర్తిగా నిషేధిస్తే దేశీయంగా తయారు చేసిన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని సర్కారు అన్ని చైనా బ్రాండ్లపై నిషేధం విధిస్తుందేమో వేచిచూడాలి.

Leave a Comment