విశాఖకు రాజధాని తరలింపుకు తేదీ ఖరారు.. ?

విశాఖను రాజధానిగా చేస్తున్నామని వైసీపీ సర్కార్ ప్రకటించిన రోజు నుంచి రాజకీయ హడావిడి ఒక్కసారిగా పెరిగింది. దాంతో అందరి చూపు విశాఖ వైపు మళ్లింది. ఒకవైపు విపక్షాలు సైతం విశాఖ రాజధాని విషయంలో తమకు తోచిన విధంగా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అమరావతి ముద్దు.. విశాఖ వద్దు.. అంటూ టిడిపి ముందుకు కదులుతున్న విషయం కూడా తెలిసినదే.

ఇదిలా ఉండగా విశాఖకు రాజధాని తరలి వస్తుందని ఈ మధ్యనే వైసిపి ప్రముఖ నేతలు ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ఒక తేదీ కూడా ప్రచారంలోకి వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు కాని జూలై 23న బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని, ఆరోజున ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం షిఫ్ట్ అవుతుందని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే జూలై 23 వరకు వేచి చూడాల్సిందే.

ఏది ఏమైనా విశాఖకు రాజధాని రాక ఆలస్యం అయితే అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రి జగనే ఇక్కడ మకాం ఏర్పాటు చేసుకుని రాజధానిని తీసుకురావటం మాత్రం తధ్యం అని అంటున్నారు వైసీపీ నేతలు. కొద్ది రోజుల్లో విశాఖ నుంచే పాలన జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ మధ్యనే స్పష్టం చేశారు. ( జూలై 23 పైగా శుక్రవారం … ఏం జరగబోతోంది.. ? )

త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు వస్తుందని, ఇక్కడి నుంచే ప్రభుత్వ పరిపాలన జరుగుతుందన్నారు. CRDA లో వున్న కేసులతో రాజధాని తరలింపుకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన చేయవచ్చని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. మరోవైపు మంత్రి బొత్స కూడా రాజధానులపై ఇప్పటికే చట్టం కూడా చేశామని, అది ఎప్పటికైనా అమలుజరిగేదే అని అన్నారు.

రాజధాని విషయంలో కోర్టులో ఉన్న కేసులకు, ముఖ్యమంత్రి పరిపాలన చేయడానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కోర్టులో ఉన్న కేసులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చూడాలి జూలై 23న ఏం జరగబోతోందో..

Leave a Comment