కారును డామేజ్ చేస్తున్న రోడ్డురోలర్ .. !

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు గుర్తుల భయం పట్టుకుంది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు కారు. అదే ఇప్పుడు ఆ పార్టీకి అనేక సమస్యలను తెచ్చి పెడుతోంది. అనేక ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు ఇండిపెండెంట్లకు రావడం టీఆర్‌ఎస్‌కు చిక్కులు తెచ్చి పెట్టింది. కొన్నిచోట్ల ఆ పార్టీ విజయావకాశాలను కూడా దెబ్బతీసింది.

కారును పోలినట్టుగా ఉండే రోడ్డు రోలర్, చపాతి రోలర్‌ గుర్తులను ఎన్నికల సంఘం ఇండిపెండెంట్లకు కేటాయిస్తోంది. ఈ గుర్తులు కూడా దాదాపుగా కారు గుర్తును పోలి ఉంటున్నాయి. దీంతో వద్ధులు, కంటిచూపు తక్కువగా ఉన్నవారు, నిరక్ష్యరాస్యులు చాలామంది కారు గుర్తు ఇదే అనుకొని ఆ గుర్తులకు ఓట్లేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ తీవ్రంగా నష్టపోతోంది.

ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా కారు గుర్తును పోలి ఉన్న రోడ్డురోలర్‌ గుర్తు టీఆర్‌ఎస్‌కు డ్యామేజ్‌ చేసింది. ఆ పార్టీ విజయావకాశాన్ని దెబ్బకొట్టింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌పై బీజేపీ అభ్యర్థి 1700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అయితే, ఇక్కడ రోడ్డు రోలర్‌పై గుర్తుపై పోటీచేసిన ఇండిపెండెంట్‌కు 3వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. వాస్తవానికి ఆ అభ్యర్థికి అన్ని ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. కేవలం కారు గుర్తును పోలి ఉండడం వల్లే అన్ని ఓట్లు రోడ్డు రోలర్‌కు పడ్డాయన్న విషయం స్థానికులు చెబుతున్నారు. అంటే ఇక్కడ టీఆర్‌ఎస్‌ విజయాన్ని రోడ్డురోలర్‌ అడ్డుకుందన్న మాట.

అంతేకాదు.. ఎంపీ ఎన్నికల్లో కూడా రెండు మూడు నియోజకవర్గాల్లో ఇదే మాదిరిగా ఈ గుర్తులు టీఆర్‌ఎస్‌ను దెబ్బతీశాయి. తాజాగా ఇదే గుర్తులు మళ్లీ టీఆర్‌ఎస్‌ నేతల గుండెలను గుభేల్‌మనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది.

ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జానారెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ ఎవరు విజయం సాధించినా చాలా తక్కువ మెజారిటీనే ఉంటుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాగర్‌ ఎన్నికల్లో ఇద్దరు ఇండిపెండెంట్లకు రోడ్డురోలర్, చపాతి రోలర్‌ గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది.

ఈ గుర్తులు ఇక్కడ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తాయోనన్న భయం టీఆర్‌ఎస్‌ నేతలకు పట్టుకుంది. దుబ్బాకలోలాగానే ఇక్కడ కూడా ఆ రెండు గుర్తులకు ఐదారు వేల దాకా ఓట్లు పోలైతే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారట. వాస్తవానికి సాగర్‌లో నిరక్ష్యరాస్యులు ఎక్కువగా ఉన్నారు. వారు కారు గుర్తుగా భ్రమపడి రోడ్డురోలర్, చపాతి రోలర్‌ గుర్తులకు ఓటేస్తే ఇక తమ పని గోవిందా అని ఆలోచనలో పడ్డారట. మొత్తానికి ఈ రెండు గుర్తులు ఫలితాలను తారుమారు చేస్తాయో.. లేదో చూడాలి మరి.!

Leave a Comment