ఇది అనుకోకుండానే..జరిగిందంటారా !

తెలంగాణలో వేలాది మందికి పింఛన్లకు లేక కొందరు, అర్హత లేదని ఇంకొందరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోపీయత్నంగా కొత్తగా ఆ పథకంలో చేరుదామని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ, సర్కారు వారి ఇబ్బందులను తీర్చడం లేదు. ఎప్పటికైనా పింఛన్లు రాకపోతాయా అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంటే, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాత్రం అనుకోకుండా కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అక్కడ ఒక్కచోటే ఎందుకు ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందా అని ఆశ్ఛర్య పోకండి ఎందుకంటే సర్కారు తలుచుకుంటే పింఛన్లకేం ఖర్మ, అడగకపోయినా అన్నీ చేస్తుంది. అయినా, సర్కారు ఇదంతా ఉత్తినే చేస్తుందనుకోకండి. దానికి ఒక కారం వుంది. అదేంటంటే ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరగనున్ననేపథ్యంలో , ఉప ఎన్నికలో మళ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఈ ఎత్తుగడ వేసింది.

ఇటీవల కాలంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో సోలిపేట కుటుంబానికి సహకరించేది లేదని గులాబీ తమ్ముళ్లు కొందరు భీష్మించుకు కూర్చున్నారు. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో అక్కడ ఎలాగైనా విజయం సాధించాలని, అక్కడ వేరే పార్టీకి స్థానం ఇవ్వకూడదని భావించిన సీఎం కేసీఆర్‌ హరీష్‌ను రంగంలోకి దించారు.

సిద్దిపేట, దుబ్బాక తనకు రెండు కళ్లలాంటివి అనుకుంటూ హరీష్‌ దుబ్బాక ఎన్నికల బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. అయితే, అక్కడ తెరాస పార్టీ జోరుకు ఇబ్బందులు ఉన్నాయని ఆయన భావించారట. అందుకే తన అమ్ముల పొదిలోని అస్త్రమైన పింఛన్లను తెరపైకి తెచ్చారట. కేవలం ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే ఇప్పుడు కొత్తగా 36వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సొమ్ము జమైందట. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా రాని పింఛన్లు ఉప ఎన్నికల పుణ్యమా అని వచ్చినందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తుంటే, టీఆర్‌ఎస్‌ పింఛన్ల పేరుతో ఓట్ల కొనుగోలుకు తెర లేపిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎలాగైతేనేం మెదక్‌ జిల్లాలో పింఛన్‌ లబ్ధిదారులకు మాత్రం మంచే జరిగిందని చెప్పవచ్చు.

Leave a Comment