దుబ్బాకలో అధికార టిఆర్ఎస్ కి భంగపాటు తప్పదా..

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి దుబ్బాక నియోజకవర్గ పై నిలిచింది అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది ఇక్కడ నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది ఇప్పటికే అధికార టీఆర్ఎస్ విపక్ష కాంగ్రెస్ బీజేపీలు గెలుపే లక్ష్యంగా తమ అభ్యర్థిని బరిలోకి దించాయి.

టీఆర్ఎస్ పై వ్యతిరేకత

ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ కు ప్రజల నుంచి కొద్దిగా నెగటివ్ టాక్ వినిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో అధికార టీఆర్ఎస్ వ్యూహాలను రచిస్తోంది. ఇక్కడి నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి ఇప్పటి వరకు నాలుగు సార్లు విజయం సాధించారు.

అయితే నియోజకవర్గం అభివృద్ధి విషయానికి వస్తే పక్కనే ఉన్న సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, మంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటలతో పోల్చిచూస్తే.. అసలు దుబ్బాకలో అభివృద్ధి జరగలేదని ఇక్కడి ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా జరిగే సంభాషణలలో దుబ్బాక యువతులో అధికార టీఆర్ఎస్ పై పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది.

అదే సమయంలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు టిఆర్ఎస్ తరఫున చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి పార్టీ టికెట్లు ఆశించారు. కానీ అధికార టీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతకు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం నియోజకవర్గంలో కొంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న అధికార టీఆర్ఎస్ కు రామలింగారెడ్డి పై ప్రజల్లో ఉన్న సానుభూతి కలిసి వస్తుందనే నమ్మకంతో ఆయన సతీమణిని బరిలోకి దించారని విశ్లేషకులు అంటున్నారు.

ఇక తనకు టిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్ వలస పోవడంతో.. ప్రధాన పోటీ మాత్రం అధికార టిఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉంటుందని దుబ్బాక ప్రజలు చెబుతున్నారు.

మంచి మాటకారిగా.. ఏ విషయంపైనా సరే సూటిగా, సుత్తిలేకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నేర్పుగా పేరున్న రఘునందన్ రావు అసెంబ్లీలో అడుగు పెడితే అధికార టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దుబ్బాక నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వాన్ని ఆయన అయితేనే నిలదీస్తారని అంటున్నారు. పైగా తెలంగాణ ఉద్యమ నేతగా కూడా ఆయనకు మంచి పేరుంది. నియోజకవర్గంలోని ప్రజలతో స్నేహ సంబంధాలు ఉన్నాయి.

రఘునందన్ రావుకు పెరిగిన ఆదరణ

యువకుల్లో అయితే రఘునందన్ రావు కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దుబ్బాకలో కొంతమందిపై పోలీసులు బనాయించిన ఎన్నో కేసులు ఉచితంగా వాదించి వారిని విడిపించిన న్యాయవాదిగా పేరు ఉంది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన రెండు సార్లు పోటీ చేశారు. ఈసారి రఘునందన్ అన్నకు ఒక అవకాశం ఇస్తే తప్పేంటి అని అంటున్నారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ ల కంటే కూడా ప్రచారంలో రఘునందన్ ముందున్నారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆయన ఇప్పటికే చుట్టేశారు. అటు సంఘపరివార్ సంస్థలకు చెందిన ఏబీవీపీ, సంఘపరివార్, కిసాన్ సంఘ్, RSS కార్యకర్తలు కూడా బిజెపి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరపున రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేసేందుకు రెడీ అయ్యారు.

Leave a Comment