సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నేతల మధ్య వార్ నడుస్తుందా..? ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ పాలనను కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారా..?
ఇప్పటిదాకా తప్పనిసరి పరిస్థితుల్లో రామలింగారెడ్డి పెత్తనాన్ని సహించిన వారంతా ఇక తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారా..? అలాంటి వారంతా ఇప్పుడు మాజీ మంత్రి దివంగత చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి పంచకు చేరుతున్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ టికెట్‌ను సోలిపేట కుటుంబంలోనే ఒకరికి ఇవ్వడం ఖాయమన్న విషయం తేలిపోయింది.
అయితే
ఆ టికెట్ రామలింగారెడ్డి భార్యకు ఇస్తారా.. కొడుకుకు ఇస్తారా అన్న విషయం ఇంకా తేలలేదు. ఈ తరుణంలోనే ఇంకా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే టీఆర్‌ఎస్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
ఇప్పటి వరకు కారు పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు సోలిపేట మరణంతో వీధికెక్కుతున్నాయి. సోలిపేట కుటుంబానికి అసమ్మతిగా ఉన్న కొందరు నేతలు మండలాల వారీగా రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాలకు చెందిన ముఖ్య నేతలు కూడా సమావేశం నిర్వహించారట.
దుబ్బాక, మిర్‌దొడ్డి, తొగుట మండలాల్లో కూడా అసంతృప్తి వాదులతో పాటు తన అనుచరులతో మాజీ మంత్రి దివంగత ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారట. రాయపోల్ మండలానికి చెందిన ముఖ్య నాయకులు కూడా రహస్యంగా సమావేశం నిర్వహించారట.
తాము పార్టీలో అన్యాయానికి గురయ్యామని, ఇక సోలిపేట కుటుంబాన్ని మోయలేమని ఈ సమావేశంలో వారు వాపోయారట. సోలిపేట కుటుంబానికి తప్ప సీనియర్ నేతలలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాము కలిసికట్టుగా పనిచేస్తామని ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం.
అయితే, ఈ విషయం తెలిసిన రాష్ట్రమంత్రి హరీష్‌రావు పార్టీ ముఖ్య నేతలతో రెండు రోజుల పాటు మాట్లాడినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.
సాధారణంగా ఇటీవల కాలంలో ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే ఆ టికెట్‌ను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం అన్ని పార్టీల్లో (వామపక్షాలు కాదు) ఆనవాయితీగా వస్తోంది. పైగా సోలిపేట రామలింగారెడ్డి హరీష్‌రావుకు మంచి స్నేహితుడు, కేసీఆర్‌కు కూడా చాలా దగ్గరి వ్యక్తి. అలాంటి వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఏ రకంగా చూసినా టీఆర్‌ఎస్ టికెట్ సోలిపేట కుటుంబంలోనే ఎవరికో ఒకరికి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే, ఆ కుటుంబానికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని మెజారిటీ కార్యకర్తలు వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు పార్టీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే.. కార్యకర్తలంతా కలిసి పనిచేస్తారా.. లేక పార్టీ అభ్యర్థి పరాజయానికి కృషి చేస్తారా అన్న అనుమానాలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. అయితే, చివరకు కేసీఆర్ రంగంలోకి దిగితే పరిస్థితిలో మార్పు ఉండవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఎన్నో ప్రశ్నలకు వేదికగా నిలుస్తోంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …