ఆ రెండు పార్టీల కళ్లూ వారిమీదే..

హైదరాబాద్‌లో ఇప్పుడు వేడి మరింతగా పెరిగింది. చలికాలంలో చలిపులి విజృంభిస్తుంటే వేడి పెరిగింది అంటారేమిటి అనుకుంటున్నారా…? వేడి అంటే ఎండవేడి కాదండి.. ఎన్నికల వేడి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు డిసెంబర్‌ 1న జరగనున్నాయి.

ఎన్నికలకు కేవలం 15 రోజులే సమయం ఉండడంతో పార్టీలన్నీ వాటిని ఎదుర్కొనేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ గోల్కొండ కోటపై గులాబీ జెండాను ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ పథకం రచిస్తుంటే.. దుబ్బాక ఎన్నిక విజయంతో హైదరాబాద్‌లో కూడా కాషాయ జెండా రెపరెపలాడాలని బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కాంగ్రెస్‌ పార్టీ మాత్రం నేనున్నానంటూ అభ్యర్థులను ప్రకటించుకుంది. కనీసం తమ ఉనికిని చాటుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ గెలుపు తర్వాత సంగతి ముందు తమ నాయకులు పార్టీ మారకుండా ఉంటే చాలన్నట్టుగా ఉంది. వారి నాయకులను, కార్యకర్తలను కాపాడుకోవడంపైనే నజర్‌ పెట్టింది.

హైదరాబాద్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలనుకున్న టీఆర్‌ఎస్, బీజేపీలు ఇప్పుడు కాంగ్రెస్‌పై కన్నేశాయి. ఈ పార్టీ నాయకులను తమ వైపునకు తిప్పుకునే పనిలో పడ్డాయి. ఎవరు ఎంతమందిని చేర్చుకుంటారా అన్నట్టుగా సాగుతున్నాయి వీరి ప్రయత్నాలు. కాంగ్రెస్‌ పార్టీ నేతలపై టీఆర్‌ఎస్‌ కన్నేస్తే.. కాంగ్రెస్‌ నేతలతో పాటు టీఆర్‌ఎస్‌ అసమ్మతివాదులను కూడా తమ బుట్టలో వేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు చాలామంది బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో హైదరాబాద్‌ నగరమేయర్‌గా పనిచేసిన బండ కార్తీకరెడ్డి ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకున్నారు. మరికొందరు స్థానిక నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ చేరికలు మున్ముందు భారీగా ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి మేయర్‌ పీఠం కోసం పోటీ పడుతున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ల కళ్లు ఇద్దరివీ కాంగ్రెస్‌పైనే పడ్డాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కువ మంది కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లలో ఎవరు ముందుంటారో మరికొన్ని రోజులు పోతేగానీ తెలియదు. మొత్తానికి ఇద్దరి టార్గెట్‌ కాంగ్రెస్సే.

Leave a Comment