చర్చనీయాంశంగా మారిన 60వేలు!

ఏమిటీ 60వేలు. వీటి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది. అసలు ఇవి ఏమిటి..? అనుకుంటున్నారు కదా ఈ హెడ్డింగ్‌ను చూసి. అవును, ఆ 60వేలకు ఓ ప్రత్యేకత ఉంది. అది భార్యాభర్తల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతోంది. ఇంతకీ ఇది దేని గురించోనని తెలియక తికమక పడుతున్నారు కదా.

అదేనండి మొన్న దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది కదా.. అక్కడ వచ్చిన ఓట్ల వివరాలే ఇవి. ఓస్‌.. ఇంతేకదా.. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా.. ఇందులో విచిత్రమేమీ లేకున్నా ఒక లాజిక్‌ మాత్రం ఉంది. అదేంటో తెలుసుకుందాం.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున సోలిపేట రామలింగారెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిపై 62,500 ఓట్ల మెజారిటీలో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 89,299 ఓట్లు వచ్చాయి.

ఇక రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డికి 26,799 ఓట్లు, మూడోస్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 22,595ఓట్లు వచ్చాయి. అయితే, ఇటీవల కాలంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించారు. దీంతో ఉప ఎన్నిక జరిగింది.

ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత బరిలో నిలిచారు. 2018లో మూడోస్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మళ్లీ ఈ సారి కూడా అదే పార్టీ తరఫున పోటీచేశారు. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కేవలం 1470 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

అయితే, ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు వచ్చిన మొత్తం ఓట్లు 61,302. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే పార్టీల ఓట్లలో ఇంత తేడా వచ్చింది. ఇంతకీ ఇందులో ఉన్న లాజిక్‌ ఏమిటంటరా..? 2018 ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామలింగారెడ్డి 62,500 ఓట్ల మెజారిటీతో గెలిస్తే.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన రామలింగారెడ్డి భార్యకు వచ్చిన మొత్తం ఓట్లే 61,302.

అంటే గతంలో వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా ఇప్పుడు రాలేదన్న మాట. అప్పటి మెజారిటీ.. ఇప్పుడు వచ్చిన ఓట్లు రెండూ 60వేలలోనే ఉండడం యాధృచ్చికమే.

Leave a Comment