సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు సుముఖత..

నదీ జల వివాదాలపై నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇద్దరు సీఎం లు తమ తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగానే వాదించారు. సమావేశం మొత్తం మీద మాత్రం సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు సుముఖత వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుకు అసలు అనుమతులు లేవని, ఇప్పుడు దాన్ని విస్తరించడం ఏంటని కెసిఆర్ ప్రశ్నించారు. అందుకు జగన్మోహన్ రెడ్డి గట్టిగానే స్పందించారు. మరి కాలేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి, దిండి, కాలేశ్వరం మూడోదశ, సీతారామ ప్రాజెక్టులతో పాటు అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారని వాటి సంగతి ఏంటని జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. మాకో న్యాయం.. తెలంగాణకో న్యాయమా అని జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఏ నిభంధనలు వర్తిస్తాయో తమాకు అవే నిబంధనలు వర్తిస్తాయన్నారు.

ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి శాఖావత్ జగన్మోహన్రెడ్డితో ఏకీభవించారు. రెండు చోట్ల ఒకే విధానం ఉండాలని, ఒక చోట ఒక విధానం.. మరొక చోట మరో విధానం ఉండడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ తోపాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ కూడా తెలంగాణకు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ పరిధిలో ఉన్నప్పటికీ శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్కేంద్రంని తన ఆధీనంలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ కేంద్రం నుంచి రోజులు నాలుగు టీఎంసీల నీటిని కిందికి వదిలేస్తుందని వివరించారు.

దీని వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పడిపోయి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలకు నీరు వెళ్లకుండా అవుతోంది అని వ్యాఖ్యానించారు. అదే నాగార్జునసాగర్ వద్దకు వచ్చేసరికి ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ తన ఆధీనంలో ఉంచుకొని, చివరకు ఏపీ కి సంబంధించిన కుడికాలువను కూడా తెలంగాణ ప్రభుత్వంమే నియంత్రిస్తోందని జగన్ వివరించారు. కాబట్టి సీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటే శ్రీశైలం ఎడమగట్టు నిర్వహణను కూడా ఏపీకి అప్పగించాల్సిందేనని జగన్మోహన్రెడ్డి పట్టుబట్టారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కేంద్ర మంత్రి శ్రీశైలం ప్రాజెక్టు అప్పగించాలనే కేసీఆర్ డిమాండ్ ను తిరస్కరించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా బేసిన్ అవతలికి ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తోందని, మరో బేసిన్ లోని ప్రాంతాలకు నీటిని తరలించడం సరికాదని కెసిఆర్ వాదించారు. ఇందుకు స్పందించిన జగన్ మోహన్ రెడ్డి కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ వారు ఇచ్చిన తీర్పు లోని 128 పేజీని చదివి వినిపించారు. అంతర్ రాష్ట్ర నదీ ఆయన కృష్ణా జలాలను ఇతర బేసిన్ లకు తరలించడం న్యాయబద్ధమైనదే నంటూ ఇచ్చిన తీర్పును జగన్మోహన్రెడ్డి చదివి వినిపించారు.

దేశంలోని రావి,బియాస్,మూలమట్ల,పెరియాడ్, నడికుడి నదుల నుంచి ఇతర నదీ పరివాహక ప్రాంతాలకు నీటిని తరలిస్తున్న విషయం కూడా జగన్మోహన్రెడ్డి ఎత్తిచూపారు. 2016 సెప్టెంబర్ 9న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కొత్తగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో తమకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని, అదనంగా నీటిని ఉపయోగించుకోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇప్పుడు అదే తరహాలో తమకు కేటాయించిన నీటి తోనే తాము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని చెబుతుంటే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం ఎలా సమర్థనీయం అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో న్యాయమా అని ప్రశ్నించారు. ఒప్పందం ప్రకారం కృష్ణా జలాల్లో ఏపీకి 512టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని, కానీ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎనిమిది వందల అడుగుల మట్టణంలోనే రోజుకు దాదాపు ఏడు టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం తరలించే అవకాశం ఉందని, కానీ ఏపీ ప్రాజెక్టులు ఎత్తులో ఉండటంతో కేటాయించిన 512 టీఎంసీల నీటిని కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి వివరించారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటూ ఏపీ మాత్రం 821 అడుగుల నుంచి నీటిని తీసుకోవాలనే హక్కు అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదు అని జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ అసమానతలు తొలగించి తమకు కేటాయించిన వాటాను వాడుకునేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకం తప్పనిసరి అని జగన్మోహన్రెడ్డి వాదించారు.

కాలేశ్వరం అంశాన్ని జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన సమయంలో జోక్యం చేసుకున్న కేంద్ర వైద్య శాఖావత్ కాలేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ ఉందా అని తెలంగాణ సీఎంను ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆదేశించారు. రాయలసీమ పథకం డిపిఆర్ సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడంతో కేసీఆర్ కూడా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ లను ఇచ్చేందుకు అంగీకరించారు. దేశంలోనే థార్ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా అనంతపురం జిల్లా ఉందని గుర్తు చేశారు.

అనంతపురం జిల్లా ఎడారి నివారణ పథకంలో ఉండడం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం పరిధిలో ఉండడాన్ని జగన్ ఎత్తిచూపి అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు ఇబ్బందులు ఉన్నా.. మహబూబ్ నగర్ జిల్లాకు 142 టిఎంసిలు, నల్గొండ జిల్లాకు 104 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించారు. అదే రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు కనీసం జిల్లాకు 50 టీఎంసీల నీరు కూడా అందుబాటులో లేదని.. ఏపీ లోని ఆరు జిల్లాలు శ్రీశైలం ప్రాజెక్టు మీదనే ఆధారపడి ఉన్నాయని జగన్ వివరించారు.

2019 జూన్ లో జరిగిన సమావేశంలో స్వయంగా కేసీయారే ప్రతి జిల్లాకు కనీసం 100 టీఎంసీల నీటి కేటాయింపు ఉండాలని.. రాయలసీమ జిల్లాలకు కూడా వర్తిస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. నాదీ జలాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి శాఖావత్ చెప్పారు. దాంతో కెసిఆర్ సుప్రీంకోర్టులో వేసిన కేసులు వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. కృష్ణా రివర్ బోర్డు ఏపీకి తరలించేందుకు కూడా అంగీకారం కుదిరింది.

మొత్తం మీద సీమ ప్రోజెక్టుల డిపిఆర్ లు సమర్పించేందుకు ఏపీ అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడి ప్రాజెక్టుల డిపిఆర్ వివరాలను సమర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో సీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాల్సి వస్తే.. తెలంగాణ ప్రాజెక్టులకు కూడా అది వర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రాష్ట్రాలు పరస్పరం సర్దుకుపోవడం తప్పనిసరిగా కనిపిస్తోంది. కౌన్సిల్ లో అంశాలవారీగా గట్టిగానే వాదనలు వినిపించినప్పటికీ చివరకు సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు సానుకూలంగానే స్పందించారు. సమావేశం జరిగిన తీరుపై కేంద్ర మంత్రి శాఖావత్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Comment