టీఎస్ హైకోర్ట్ ఆదేశంతో ఎవరు ఇరుకున పడినట్టు ..

ఎంపీలు ఎమ్మెల్యేల పై పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన విచారించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ప్రత్యేక సార్టులతో పాటు ఎసిబి, సిబిఐ ప్రత్యేక కోర్టులను హైకోర్టు ఆదేశించింది.

ఈ ఆదేశాలను టీడీపీకి అనుకూలంగా ఉంటాయని పేరున్న రెండు పత్రికలు మొదటి పేజీలోనే ప్రముఖంగా ప్రచురించాయి. ఈ పత్రికలు ఇంతగా ఆ ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం.. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు తెలంగాణాలోనే ఉండడం. అక్కడి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి. ఈ అంశాన్ని రెండు పత్రికలు ప్రముఖంగా రాశాయి.

జగన్ పై మాత్రమే ఉన్నాయా..

జగన్ కేసులు అక్కడే ఉన్నాయని, వాటిపైనే రోజువారీ విచారణ జరుగుతుంది అని ఉత్సాహపూరితమైన కథనాల్ని ప్రచురించాయి. తెలంగాణలో ఒక్క జగన్ కేసులే కాకుండా.. అక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పై ప్రత్యేక కోర్టులో 118 కేసులు ఉన్నాయి. సిబిఐ కోర్టులో 24 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకుస్టే పై ఆగిపోయిన కేసుల్లోనూ కదలిక రాబోతోంది.

స్టేలకు సంబంధించిన కేసులను హైకోర్టు నేరుగా విచారించబోతోంది. ఇదే జరిగితే చంద్రబాబు పై పలు కేసుల్లో ఉన్న స్టేల సంగతి కూడా తేల్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసుతో పాటు, అట్రాసిటీ కేసులు, భూ కబ్జాలు ఇతర కేసులు అన్నీ కలిపి 42 కేసులు పెండింగ్లో ఉన్నాయి. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పైన పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ తో పాటు టీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రుల పైన భారీగానే కేసులు పెండింగ్లో ఉన్నాయి.

టిడిపి మీడియా మాత్రం కేవలం జగన్ కేసులు అంశాన్ని మాత్రమే గుర్తు చేసింది.. కానీ ఓటుకు నోటు గురించి కానీ.. మరే ఇతర నాయకుల గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించక పోవడం విశేషం. నిజానికి జగన్ ఆస్తుల కేసు ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిలో ఉంది.

క్విడ్ ప్రో కో జరిగిందని చెబుతున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి పదవిలో లేరు. ఒకవేళ నేరం జరిగి ఉంటే.. నాడు క్యాబినెట్ మంత్రులు, అధికారులు కూడా బాధ్యులు అవుతారు. కానీ నాడు కాంగ్రెస్ పార్టీ తన క్యాబినెట్ మంత్రులను ఈ కేసు నుండి రక్షించేసింది. కేవలం జగన్మోహన్రెడ్డిని, కొందరు పారిశ్రామికవేత్తలను, అధికారులను కేసులో చేర్చింది. ఆ తరువాతి కాలంలో పలువురు ఐఏఎస్ అధికారులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి క్లీన్ చిట్ తెచ్చుకున్నారు.

అలా జరిగివుంటే

ఇలా మంత్రులు, అధికారులు తప్పు చేయనప్పుడు మరి ప్రభుత్వంలో ఎలాంటి పదవిలో లేని జగన్మోహన్ రెడ్డి, ఇతర పారిశ్రామిక వేత్త లపై కేసులు ఎలా నిలబడతాయి అన్నది చాలా కాలంగా న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్న విషయం. టీడీపీ మీడియా పదే పదే కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే.. మోడీ తలుచుకుంటే.. జగన్ కు శిక్ష పడుతుంది అని చెబుతూ వస్తున్నారు.

తీర్పులు అలా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇష్టానికి వస్తాయా అన్నది పక్కన పెడితే.. టీడీపీ మీడియా చెప్పినట్లే జరుగుతుంది అనుకున్నా ప్రస్తుతం ఢిల్లీ పెద్దలకు, జగన్ మోహన్ రెడ్డి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కేంద్రంలో చాలా అంశాలకు వైసీపీ మద్దతు ఇస్తోంది. కీలకమైన బిల్లులను గట్టెక్కించేందుకు సహాయపడుతుంది. అలాంటప్పుడు మోడీ పనిగట్టుకుని జగన్ ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు.

పదేళ్ల నుంచి నిత్యం కేసులు ఉన్నాయి అంటూ విపక్షాల నుంచి విమర్శలు చేయించుకునే కంటే, ఈ కేసుల వ్యవహారం త్వరగా తేలితే మంచిదనే ఉద్దేశంతో వైసీపీ కూడా ఉంది. కేసులు ఎలా కదిలినా వైసిపికి ఇప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రతిపక్షంలో ఉండి ఉంటే ఇబ్బందులు ఉండేవేమో గానీ.. ఒకసారి అధికారంలోకి వచ్చి పార్టీ నిలబడింది కాబట్టి ఈ కేసుల కారణంగా పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు.

పోతే రోజువారీ విచారణ సందర్భంగా జగన్ వ్యతిరేకులు, వ్యతిరేక పత్రికలు రోజుల కొద్దీ నిత్యం అక్కడి వాదనను తమకు కావాల్సిన విధంగా ప్రచురిస్తూ ఆత్మానందం పొందడానికి వీలు ఉంటుంది.

Leave a Comment