మళ్ళీ మొదలుపెట్టిన వైస్రాయ్ తరహా వెన్నుపోటు రాజకీయం ..

ఏదైనా ఒక విషయాన్ని ప్రచారం చేయడంలో ఆదీ – అంతం రెండూ తానే చేయగల సమర్థులు చంద్రబాబు నాయుడు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి 23 స్థానాలు పడిపోవడమే ఒక అవమానం అయితే.. ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికలకు వెళ్లే చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో తాను తప్ప మరొక ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేక పోవడం ఆ పార్టీని మరింత కుంగదీసింది.

కౌంటింగ్ సమయంలో ఒక దశలో చంద్రబాబు కూడా వెనుకబడిపోవడంతో చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎన్నికల తర్వాత వైసిపి చిత్తూరు జిల్లాలో మరింత పట్టు సాధిస్తోంది. ఏకంగా కుప్పంనే టార్గెట్ చేసింది వైసిపి. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు చెమటలు పట్టించిన వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి మరణంతో ఇప్పుడు ఆయన కుమారుడు భారత్ ను జగన్ రంగంలోకి దింపారు.

పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి మద్దతు ఉండడంతో భారత్ దూసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడును కూడా ఓడిస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి ఇంత దారుణంగా దెబ్బ తినడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన భూమిక పోషిస్తున్నారు అన్నది తెలుగుదేశం పార్టీకి తెలుసు.

రామచంద్రా రెడ్డి టార్గెట్ గా

చిత్తూరు జిల్లాలో జగన్ కు రామచంద్రారెడ్డి కుటుంబం తోడవడం అగ్నికి వాయువు తోడైనట్లుగా టిడిపిని దహించివేస్తోంది. అందుకే చంద్రబాబు అర్జెంటుగా తన ప్రచార బృందాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గురి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో నైనా చిత్తూరు జిల్లాలో పరువు నిలుపుకోవాలని అగ్నికి వాయువును దూరం చేయాలన్నది చంద్రబాబు ఫాలో అవుతున్న పద్దతి. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం తనకు నమ్మినబంటు చానల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఒక గాసిప్ వదిలారు.

సోషల్ మీడియాలో ఎవరో ఇలా అనుకుంటున్నారు అంటూ చంద్రబాబు ఆలోచనలు అమలు చేసింది ఆ మీడియా. ఒకవేళ కేసుల కారణంగా జగన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తే తాను సీఎం కావాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారని, అందుకే వైసిపి ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారని, 80 మంది ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నారని సోషల్ మీడియాలో ఎవరో చెప్పుకుంటున్నారు అంటూ ఆ చానల్ ప్రసారం చేసింది.

మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నారు అని ఆ చానల్ చెప్పుకొచ్చింది. ఈ కథనాన్ని పరిశీలిస్తే వైస్రాయి వెన్నుపోటు బుద్దులు ఇంకా పోయినట్టుగా కనిపించడం లేదు. తను దొంగ అయితే పక్కింటోడిని నమ్మడు అన్నట్టుగా.. అందరూ చంద్రబాబు లాగే చేస్తారు అనుకుంటున్నట్లుగా ఉంది.

peddireddy Ysjagan newsmart9

చిత్తూరు జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్కరు చంద్రబాబు మాదిరి వెన్నుపోటు పొడుస్తారు అంటే ఎలా.. జగన్ మోహన్ రెడ్డి వయసు మీద పడిన ఎన్టీఆర్ కాదు కదా. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు జగన్ కోసం చిన్నపిల్లాడిలా అసెంబ్లీలో నిలబడిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాంటి వ్యక్తి వెన్నుపోటు పొడుస్తారా.. !

నిజానికి ఇలాంటివి వెన్నుపోట్ల ముప్పు వయసు మీద పడిన నాయకులకు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. జగన్ అవసరమైతే మరోసారి ఓ ఐదు వేల కిలోమీటర్లు ప్రజల్లో నడిచే సత్తా కలిగి ఉన్నారు. సొంత జిల్లాలో బలపడాలంటే ఆ హైదరాబాదును వదిలేసి కుప్పంలో కుర్చీ వేసుకొని కూర్చుంటే ప్రయోజనం ఉండొచ్చు కదా..

వైస్రాయ్ తరహా ఎత్తుగడ

చిత్తూరు జిల్లాలో టీడీపీకని బలోపేతం చేయాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని రాజకీయంగా దెబ్బ తీయాలి. కానీ అందుకోసం మరీ ఇంత దిగజారుడు దారి వెతుక్కోవడం ఏంటి. 80 మంది ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపు ఉన్నారని ఏకంగా ఒక ఫిగర్ కూడా చెప్పేస్తున్నారు. ఇదే ఎత్తు అప్పట్లో వైస్రాయ్ హోటల్ వద్ద ప్రయోగించారు.

20 మంది ఎమ్మెల్యేలు లోపల పెట్టుకొని వంద మంది ఎమ్మెల్యేలు వచ్చేసాఋ అంటూ పత్రికల్లో రాయించుకుని, మిగిలిన వారిని కూడా సమర్థవంతంగా వైస్రాయ్ బోన్ లోనికి నాడు చంద్రబాబు రప్పించగలిగారు. కానీ ఇది వైస్రాయ్ కాలం కాదు. జగన్ కు వ్యతిరేకంగా అడుగులేసిన 23 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైందో ఈ రాష్ట్రంలో అందరూ చూశారు.

ఇదేం తొలిసారి కాదు

అసలు ఇలాంటి కథనాలు రాయడం ఇదే తొలిసారి కూడా కాదు. కొన్ని నెలల క్రితం విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేలందరినీ తనవైపు తిప్పుకొని సీఎం కావాలనుకుంటున్నారని.. బిజెపి మద్దతు కూడా ఆయన కోరుతున్నారు అంటూ ఇవే మీడియా సంస్థలు కథనాలు రాసి ఆత్మానందం పొందాయి. ఆ తర్వాత మరో సందర్భంలో ఒక ఎంపీ తనతో పాటు పది మందిని తీసుకెళ్లి బీజేపీలో కలవబోతున్నారని కూడా కొద్దిరోజులు ప్రచారం చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంతు.

కొద్దిరోజులయితే షర్మిల మీదనో.. వీలైతే విజయమ్మే సొంత కుమారుడు పై తిరుగుబాటు చేయబోతున్నారు అని కూడా ప్రచారం చేయగల సమర్థులు అన్నది ఈ ప్రచారం బట్టి అర్థమవుతోంది. ఇలాంటి పుకార్లు ప్రచారం చేస్తే ఉన్న విశ్వసనీయత, విలువలు పోగొట్టుకోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. ఇలా చంద్రబాబు ఒకరు చెబితే వినే వ్యక్తి కాదు కాబట్టి 23 సీట్లకు పడిపోయిన తరువాత కూడా పాత పద్ధతినే ఆయన అనుసరిస్తున్నారు.

ఇప్పుడు.. ఎప్పుడూ కూడా అదే ఫాలో అవుతారు. ఇదే విషయాన్ని ఒక ఛానల్ వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద ప్రస్తావించగా, తాను జగన్ మోహన్ రెడ్డి కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు లాగా జీవితాంతం వెన్నుపోటు దారుడుగా పిలిపించుకునే వ్యక్తిని తాను కాలేను అని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో తమను ఎదుర్కోలేక ఇలాంటి ప్రచారాలు చంద్రబాబు ఇంకా చాలా చేస్తారని కూడా ఆయన తేల్చేశారు.

Leave a Comment