వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని బిజెపి, జనసేన ప్రకటించాయి. ఇప్పుడు టిడిపి ఏం చేయబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన దుర్గాప్రసాద్ కు 55 శాతం ఓట్లు వచ్చాయి. టిడిపి నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మికి 37.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ లోక్ సభ పరిధిలోని ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించలేరు. 2014లో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినప్పటికీ ఇక్కడ వైసిపి విజయం సాధించింది.
ఒంటరిగా వెళ్లలేక
ఈ నేపథ్యంలో మరోసారి ఒంటరి సాహసం చేసేందుకు చంద్రబాబు వెనుకాడుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఉప ఎన్నికలను వేదికగా చేసుకొని బిజెపితో దోస్తీకి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. కలిసి పోటీచేసేందుకు అంగీకరిస్తే తిరుపతి స్థానాన్ని ఇచ్చేందుకు సిద్హమని చంద్రబాబు, బిజెపి అధ్యక్షుడు నడ్డా వద్దకు రాయబారం పంపారు అని చెబుతున్నారు. అటువైపు నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు అన్నది తెలుస్తుంది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత వీలు చిక్కినప్పుడల్లా మోడీ ని పొగుడుతూ వస్తున్న చంద్రబాబునాయుడు, బీజేపీతో పొత్తు కోసం రాయబారం నడిపినా ఆశ్చర్యపోవాల్సినది ఏమీ లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపితో దోస్తీకి ప్రయత్నించడం ద్వారా కొన్ని భారాలను మరికొన్ని ఒత్తిళ్లను తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉండవచ్చు.
అక్కడ ఓట్లు పడాలంటే
మూడు రాజధానులు వ్యవహారంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు కారణంగా రాయలసీమలో టీడీపీ పై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేస్తే గతం కంటే దారుణమైన ఫలితం రావచ్చు. అదే జరిగితే ఆ పార్టీ ఉనికి పైనే ప్రభావం పడుతుంది. బిజెపి, జనసేన ఒక కూటమిగా.. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలో ఉన్న వైసిపికి అది మరింత మేలు చేస్తుంది. పైగా టిడిపిని తీవ్ర స్థాయిలో దెబ్బతీసి ఆ స్థానాన్ని ఆక్రమించాలి అన్నది బీజేపీ ఆలోచన.
బిజెపికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉప ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. అదే జరిగితే మరోసారి బీజేపీకి సొంతంగా ఎదిగే ప్రయత్నాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో టికెట్ ను గాలంగా వేసి మరోసారి బిజెపి ని తన తోక పార్టీగానే మార్చుకునేందుకు చంద్రబాబు ఈ ఎత్తు వేసి ఉండవచ్చు.
సొంతంగా ఎదగాలననే బీజేపీ ప్రయత్నాలకు ఆదిలోనే గండి కొడితే తిరిగి 2014 తరహాలోనే బిజెపి, జనసేన భుజాలపై రాబోయే ఎన్నికలను ఎదుర్కోవచ్చు అన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. మరీ గట్టిగా పట్టుబడితే 2024 ఎన్నికల్లో బిజెపికి, జనసేనకు కాసిన్ని ఎక్కువ సీట్లు కేటాయించేందుకు కూడా చంద్రబాబు వెనుకాడకపోవచ్చు.
బిజెపి వ్యూహం ఏమిటి
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కు కావాల్సింది జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలే. ఒంటరిగా వెళ్తే కష్టమనే నిర్ధారణకు చంద్రబాబు ప్రస్తుతం వచ్చినట్టుగా ఉంది. అందుకే తిరుపతి సిటు బిజెపికి అప్పగిస్తే, ఒకవేళ గెలిస్తే దాన్ని పెద్దన్నగా ఉండి గెలిపించానని తన మీడియా ద్వారా విస్తృతంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. ఓడిపోతే ఆ నింద తన ఒక్కడి మీద పడకుండా ఉంటుంది.
బీజేపీతో స్నేహం మళ్లీ చిగురిస్తే జగన్ ప్రభుత్వాన్ని మరింత రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు కూడా వెసులుబాటు చంద్రబాబు దొరుకుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలు, కేసుల నుంచి కూడా రక్షణ లభిస్తుందని చంద్రబాబు ఆలోచిస్తూ ఉండవచ్చు.
ఏపీలో బీజేపీ బలపడిన ప్రతిసారీ, చంద్రబాబు పొత్తు పెట్టుకొని బిజెపి ఓటు బ్యాంకును కబళిస్తూ వచ్చారు అని అధ్యక్షుడు అయినా వెంటనే పదేపదే ఆరోపించారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అదే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సారి కూడా చంద్రబాబు వలలో బిజెపి పడుతుందో, సోము వీర్రాజు చెప్పినట్లు టీడీపీని ఒంటరిగా వదిలేసి ప్రతీకారం తీర్చుకుంతుందో వేచి చూడాలి.