విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ఇదే చేస్తుందా.. !

పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశానికి ప్రాధాన్యత

ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో అధికారం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఏ చిన్న అవకాశం దొరికినా దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. అధికారంలో ఉన్న పార్టీని గద్దెదింపేందుకు.. ప్రజల నమ్మకాన్ని చూరగొనేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తాయి. కానీ రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం, ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారం దక్కించుకోవాలనే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ ప్రజల మెప్పు పొందేందుకు వున్న అవకాశాలను కూడా ఉపయోగించుకోవడం లేదా అనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీకి మళ్లీ పాలన చేసే ఉద్దేశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎలాగో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేలిపోయింది. ఇక ఏపీలోను ఆ పార్టీ తీరు మారడం లేదు. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడు తగ్గినట్లే కనిపిస్తోంది.

ఊహల్లో టిడిపి నేతలు

కేవలం ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ పై వ్యతిరేకత వస్తే.. వచ్చే ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని టిడిపి నేతలు ఊహల్లో తేలుతున్నారు. అంతే తప్ప రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పోరాడి ప్రజలను తమవైపు పెట్టుకోవాలనే ప్రణాళిక ఏ మాత్రం లేదనేది స్పష్టమవుతోంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం చర్యలపై టిడిపి వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనంగా మారింది.

ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయట్లేదు అనేది కాదనలేని నిజం. ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాలకు మద్దతు పలకడంతోనే తమ పని అయిపోయినట్లు వ్యవహరిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశానికి ప్రాధాన్యత పెరిగింది.

కేంద్రం ను నిలదీయగలరా

అయితే ఈ సమావేశాల్లో కేంద్రంను నిలదీయడానికి వైసీపీ నాయకత్వం వహించాలని కోరిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. పార్టీ ముందుకు వస్తే రాజీనామాలకు తాము సిద్ధమని ప్రకటించారు. ఇక్కడే ఆ పార్టీ నిజస్వరూపం బయటపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విశాఖ ఉక్కు సమస్య మీద అంత చిత్తశుద్ధి ఉంటే టిడిపినే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి.. అప్పుడు వైసీపీ కలిసి రాకపోతే అధికార పార్టీపై ఒత్తిడి పెట్టొచ్చు.

అలా చేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని పొందవచ్చు కానీ.. అలా కాకుండా సమస్యకు కారణమైన కేంద్రాన్ని వదిలేసి జగన్ ను ఇబ్బంది పెట్టాలని టిడిపి ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం కచ్చితంగా బెడిసికొట్టే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదంపై కూడా తన వైఖరిని స్పష్టంగా చెప్పిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. జగన్ పై మాత్రం విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తమకు నష్టం కలుగుతుందని ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు జగన్ కు లేఖ రాయడంతో ఆ పార్టీకి సీమపై ఉన్న వ్యతిరేక బుద్ధి బయటపడిందన్న వాదనకు బలం చేకూరింది. జల వివాదంపై పూర్తి అవగాహన తెచ్చుకోకుండా, సమస్యకు కారణం తీసుకోకుండా కేవలం జగన్ పైన విమర్శలు చేయడంతో టిడిపి క్రమంగా ప్రజలకు దూరం అవుతుందనే ఆందోళన సొంత పార్టీ శ్రేణుల్లోనే లేకపోలేదు.

Leave a Comment