తెలంగాణాలో తెలుగుదేశం కథ ఇక ముగిసినట్టేనా..!!

గ్రేటర్ ఎన్నికల ఫలితాల ద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ముగిసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టిడిపి ఆవిర్భావం తర్వాత అత్యంత పేలవమైన పనితీరును గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనబరిచింది.

55 చోట్ల విజయం సాధించి టిఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించగా, నాలుగు స్థానాల నుంచి 48 స్థానాలకు బిజెపి ఎగబాకి రెండో స్థానంలో నిలిచింది. 44 స్థానాలతో ఎంఐఎం తన పట్టు నిలుపుకుంది.

కాంగ్రెస్ కు ఈసారి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. సీమాంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న చోట టిఆర్ఎస్ మంచి ప్రదర్శన కనబరిచింది. సీమాంధ్ర ఓటర్లు అత్యధికంగా టిఆర్ఎస్ కు అండగా నిలిచినట్లు ఓటింగ్ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు.

కూకట్ పల్లి జోన్ లో 22 వార్డులుండగా ఏకంగా 20 చోట్ల టిఆర్ఎస్ విజయం సాధించింది. రెండు మాత్రమే బిజెపికి దక్కాయి. టిఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో దాదాపు సగం సెటిలర్లు అధికంగా ఉన్నవే. వైసిపి పోటీ చేయకపోవడం.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలతో పాటు ఇతర కారణాల వల్ల వైసిపి ఓటింగ్ సైలెంట్గా టీఆర్ఎస్ వైపు మళ్లిందని విశ్లేషిస్తున్నారు.

టిడిపి బరిలో ఉన్నప్పటికీ చంద్రబాబును నమ్ముకొని ప్రయోగం చేయడం ఇష్టం లేక టిడిపి ఓటర్లు కూడా టీఆర్ఎస్ వైపు, మరికొందరు బిజెపి వైపు మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ భారీగా దెబ్బతింది.

ఎల్బినగర్ జోన్ లో బిజెపి 15 స్థానాల్లో విజయం సాధించగా.. టిఆర్ఎస్ కేవలం ఆరు స్థానాలకు పరిమితమైంది. అయితే 17 డివిజన్లలో టిఆర్ఎస్ తక్కువ ఓట్లతో ఓటమిపాలైంది. బి.యన్ రెడ్డి నగర్ లో 32 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు.

ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా లక్ష్మీప్రసన్న పోటీచేయగా.. ఏజెంట్ గా ఉండేందుకు అవకాశం వస్తుందని ఆమె కుమారుడు రంజిత్ గౌడ్ కూడా బరిలో నిలిచారు. తల్లికి వేసినా.. కుమారునికి వేసిన ఒకటేనని భావించిన కొందరు వ్యక్తులు రంజిత్ గౌడ్ కు ఓటు వేశారు. దీంతో తల్లి లక్ష్మీ ప్రసన్న 32 ఓట్ల తేడాతో ఓడిపోగా, కుమారుడికి 39 ఓట్లు వచ్చాయి.

మల్కాజిగిరిలో 178 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ కోల్పోయింది. ఆరు డివిజన్లలో 310 కంటే తక్కువ ఓట్లతో, మరో 7 డివిజన్లలో 1000 కంటే తక్కువ ఓట్లతో టిఆర్ఎస్ ఓటమిపాలైంది. ఇక టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 106 డివిజన్ లలో టిడిపి తన అభ్యర్థిని బరిలో నిలిపింది.

2016 లో కేపీహెచ్బీ డివిజన్ లో మాత్రమే టిడిపి విజయం సాధించగా, ఇప్పుడు ఆ ఆనవాలు కూడా మిగలలేదు. కూకట్ పల్లి అంటే టీడీపీ అని ఒకప్పుడు ప్రచారం చేసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు తేలిపోయాయి. పోటీ చేసిన 106 డివిజన్ లలోను టిడిపి డిపాజిట్లు కోల్పోయింది.

ఇకపై తెలంగాణ రాజకీయాల్లో ఇతర పార్టీలు టీడీపీతో పొత్తు కోసం ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇది వరకు ఇతర పార్టీలతో కలిసి వెళ్లడం వల్ల టిడిపి సొంత బలం పై స్పష్టత రాలేదు.

ఈసారి ఒంటరిగా పోటీ చేసి అన్ని డివిజన్లలోను డిపాజిట్లు కోల్పోయింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును గౌరవిస్తాం అని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ వ్యాఖ్యానించారు.

Leave a Comment