డిజిటల్ బిజినెస్ హబ్ గా టాటా .. చిరు వ్యాపారులకు చేయూత.. !

దేశంలో శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ.. టాటా. గుండుసూది నుంచి ఏరోప్లేన్ వరకు ఈ సంస్థ పనిచేయని రంగమంటూ లేదు. ఓ వైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే.. మరోవైపు దేశ పురోగతిలో భాగమైంది.

ఎప్పుడూ సరికొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యాపార ప్రయోగాల్లో ముందుండే టాటా సంస్థ దేశంలో మరో సంచలనానికి తెర తీయబోతోంది. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల మార్కెట్లు పెంపొందించే దిశగా టాటా సన్స్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం చైనా దిగ్గజ వ్యాపార సంస్థ అలీబాబాతో పాటుగా గూగుల్, జోహో సంస్థల మార్గదర్శకాలను పరిశీలిస్తోంది.

ఆ సంస్థల మాదిరిగానే డిజిటల్ రంగంలో పట్టు పెంచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెంగుస్వామి రామస్వామి నేతృత్వంలో టాటా బిజినెస్ హబ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆయన టిసిఎస్ అయాన్ ( TCS iON ) కు గ్లోబల్ హెడ్ గా ఉన్నారు.

చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు టిసిఎస్ అయాన్ క్లౌడ్ ఆధారిత సేవలను అందిస్తోంది. టాటా సంస్థల్లో నూతన విభాగమైన టాటా బిజినెస్ హబ్ ద్వారా డిజిటల్ సేవలను విస్తరించనుంది. TCS అందించే డిజిటల్ టూల్స్ కు ఇది మార్కెటింగ్ సౌకర్యం కల్పించనుంది. అంతేకాదు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకొని నిధులను సేకరించనుంది.

దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోలేక పోవడమే కాదు.. నిధులు, టెక్నాలజీ కొరతలను కూడా ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ సమస్యకు టాటా బిజినెస్ హబ్ ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆ సంస్థ అధికారులు భరోసా ఇస్తున్నారు.

టాటా బిజినెస్ హబ్ విస్తరణ కోసం ఇప్పటికే సలహాదారులను నియమించిన టాటా యాజమాన్యం.. చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు కంపెనీల యాజమాన్యాల సలహాలు కూడా సేకరిస్తోంది. అంతేకాదు టాటా బిజినెస్ హబ్ తొలి డిజిటల్ బిజినెస్ మొబైల్ అప్లికేషన్ కోసం ఓలా, డైలీహంట్ వంటి Digital startups నుంచి నిపుణుల్ని నియమించుకుంది. మొత్తానికి డిజిటల్ టాటా బిజినెస్ హబ్ ప్రయత్నాలు ఫలిస్తే దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల రాత మారుతుందన్నారు మార్కెట్ నిపుణులు.

1 thought on “డిజిటల్ బిజినెస్ హబ్ గా టాటా .. చిరు వ్యాపారులకు చేయూత.. !”

Leave a Comment