చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..?

చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు : చైనా తన దేశం తప్ప మిగిలిన ప్రపంచామంతా ఏమైపోయినా పర్వాలేదు అనుకునే అత్యంత స్వార్ధపూరిత ఆలోచనలు కలిగిన దేశం. తన విస్తరణ వాదం నేగ్గించుకోవడానికి వేసే ఎత్తుగడలు.. గుంటనక్కలు కలిసి వేసే పన్నాగాల కంటే కూడా దారుణంగా, క్రూరంగా ఉంటాయి. అక్కడి అధికారులు కూడా ఆ దేశం కోసం అలా పని చేస్తారు అనేది మనం ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయం.

మాములుగా చైనా వ్యూహాల్లో ప్రధానమైనది, చిన్నచిన్న దేశాలకు అప్పులు ఇవ్వడం.. వాటిని తీర్చలేని స్థితికి ఆయా దేశాలను తీసుకురావడం. ఆ తర్వాత ఆ అప్పుకి బదులుగా ఆ దేశంలో వ్యాపార లేదా స్థలాలను బదులు తీసుకోవడం చేస్తుంది. తద్వారా తన బలాన్ని నలుదిశలా వ్యాపింపజేసుకుంటుంది. శ్రీలంక కూడా ఇప్పుడు చైనాకు తీర్చలేని అప్పుల ఊబిలో ఉంది. దాంతో కొన్ని చోట్ల భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా వ్యవహరిస్తోంది.( Integrated Battle Groups | అన్నిటికీ రక్షణశాఖ సిద్ధమన్న రాజ్ నాథ్ సింగ్ ! )

తాజాగా భారత్ సమీపంలోని శ్రీలంకకు చెందిన మూడు దీవులను చైనాకు అప్పగించినట్లుగా శ్రీలంక ఎంపీ రాధాకృష్ణన్ తెలిపారు. పవన విద్యుత్ తయారీ కోసం ఈ దీవులను తమ దేశం చైనాకు అప్పగించినట్లు చెప్పారు. దీనివల్ల భారత్ కు ముప్పు ఉందని భావించిన శ్రీలంక తమిళులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కూడా తెలిపారు. వ్యాపార దృక్పథంతో చైనా పెట్టుబడులకు శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వ్యక్తం చేశారు.

జాఫ్న సమీపంలోని పాల్క్ జలసంధిలోని ద్వీపాలను ఈ ప్రాజెక్టు కోసం చైనాకు ఇవ్వడానికి జనవరి 18న శ్రీలంక కాబినెట్ ఆమోదించింది. ఈ హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి వ్యవస్థ ఏర్పాటు పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి ఈ ప్రాజెక్టు కోసం ఒక భారతీయ కంపెనీ మొదటి రౌండ్లోనే టెండర్ సమర్పించగా.. దాన్ని సేకరణ కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన మొత్తాన్ని శ్రీలంకకు విరాళంగా ఇవ్వడానికి భారత ప్రభుత్వం అంగీకరించినా కూడా.. శ్రీలంక నుండి స్పందన రాలేదు. ( గుజరాత్ లో బీజేపీ పట్టుకోల్పోతోందా .. ? )

భారత దేశంలోని శ్రీలంక మాజీ హైకమిషనర్, రాష్ట్రపతి మాజీ కార్యదర్శి ఆస్టిన్ ఫెర్నాండో .. ఈ ప్రాజెక్టు శ్రీలంక, భారత్ సంబంధాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొలంబో పోర్ట్ లోని తూర్పు టెర్మినల్ ను కోల్పోయే విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు భారతదేశం అధికారికంగా ప్రకటించినందున.. భారతదేశానికి దగ్గరగా ఒక చైనా ప్రాజెక్టును నిర్వహించడానికి క్యాబినెట్ ఆమోదించడం తీవ్రమైన, దౌత్య పరమైన సమస్యలను లేవనెత్తుతుందని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్న మాట.

డెల్ఫ్ట్ ద్వీపం భారతదేశంలోని రామేశ్వరం తీర్థానికి 48 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంతకుముందు ఉత్తరాన హౌసింగ్ ప్రాజెక్టులో చైనా జోక్యం, కొలంబో పోర్ట్ లో చైనా జలాంతర్గామి రాకపై భారత్ అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది. ఉత్తర దీవుల్లో విద్యుత్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు సమకూర్చగా.. చైనా కంపెనీ పోటీ టెండర్ విధానంలో అర్హత సాధించినట్లుగా శ్రీలంక విద్యుత్ ఇంధన శాఖ మంత్రి చెప్పారు. ఇది భారత్ కు భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామమే అవుతుంది. అయితే దీని పట్ల భారత్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.

1 thought on “చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..?”

Leave a Comment