కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి… సోషల్ మీడియాలో ట్రెండింగ్ పొలిటీషియన్.. !!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిపోయిన నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు అనే దాని కన్నా అందులో ఎవరికి అవకాశాలు వస్తాయో అనేది ఆసక్తిగా మారింది.

మరో ఆరు నెలల్లో

జగన్ అనుకున్నట్లుగా మరో ఆరు నెలల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది. కొంచెం అటూ ఇటూగా జరగొచ్చు. ఆశావాహుల జాబితా కూడా చాలా పెద్దదే. నేతల పనితీరు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఈ పనితీరు ఆధారంగా ఎవరికి ఛాన్స్ ఉండొచ్చు అనే దానిపై సహజంగానే చర్చ జరుగుతూ ఉంటుంది. కొందరి ప్రముఖుల పేర్లు వినిపిస్తూనే వున్నాయి.

అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కేవలం నియోజకవర్గ స్థాయి లోనే కాకుండా తన పేరుతొ అన్ని నియోజక వర్గాల వారికి పరిచయమయ్యారు. సోషల్ మీడియాలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక ట్రెండింగ్ పొలిటీషియన్.

ధర్మవరం వీధుల్లో అనునిత్యం జనాల మధ్య తిరుగుతూ వున్నా వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కేతిరెడ్డి.

సమస్యల సత్వర పరిష్కారం

ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని, అక్కడే వాటికి పరిష్కారం చూపడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు డైరెక్ట్ గా ఎమ్మెల్యేతో మాట్లాడే అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమం వారికి చాలా సద్వినియోగం అవుతుంది కూడా.

ఏదైనా సాంకేతిక కారణాలతో తమకు పెన్షన్ రావడం లేదని చెప్పుకునే వయోవృద్ధుల దగ్గరి నుంచి, తమకు ఫలానా పథకం అందటం లేదని చెప్పుకునే వారితో సహా స్థానిక సమస్యలను ప్రస్తావించే మరికొంత మందికి ఈ ఎమ్మెల్యే చేరువవుతున్నారు.

సమస్యలు ఎక్కువగా వున్న పట్టణాల్లో ఒక్కో వార్డుకు ఒక్కరోజు ఎమ్మెల్యే స్వయంగా వెళుతున్నారంటే అది చిన్న విషయం ఏమీ కాదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఇలాంటి సమస్యలకు మొహం చాటేస్తూ ఉంటారు. కానీ కేతిరెడ్డి తీరు భిన్నంగా ఉంటుంది. ఇదే ఆయన ఇమేజ్ ను పెంచింది.

గుడ్ మార్నింగ్ ధర్మవరం సోషల్ మీడియాలో ట్రెండింగ్

గుడ్ మార్నింగ్ ధర్మవరం వీడియోలు కేవలం ఫేస్బుక్ లోనే కాకుండా యూట్యూబ్ లో చక్కర్లు కొడుతుంటాయి. ప్రజలతో నేరుగా సంభాషించే వీడియోలు యూట్యూబ్ లో చాలానే పోస్ట్ అయ్యాయి కూడా. ఇక అనుచర వర్గానికి అండగా ఉండటంలో కూడా కేతిరెడ్డికి మంచి పేరుంది.

అడ్డగోలుగా దోచుకోమనే రకం కాదు. జన్మభూమి కమిటీలు, అధికారపార్టీ గ్రూపుల చింతే లేదు. ఇప్పుడు జిల్లాలో కేతిరెడ్డి కి సీనియర్ల నుంచి కూడా అంత పోటీ లేనట్టే. 20 ఏళ్ల నుంచి ధర్మవరం రాజకీయాల్లో గట్టిగా పని చేస్తూ ఇప్పుడు రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈ నేపథ్యంలో వైయస్ రాజశేఖర్రెడ్డి సన్నిహితుడైన కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి తనయుడిగా కేతిరెడ్డికి జగన్ క్యాబినెట్ లో అవకాశం ఇస్తుందేమో చూడాలి.

Leave a Comment