స్మార్ట్ ఫోన్.. అంత స్మార్ట్ కాదేమో ..?

మనకు టెక్నాలజీ నిజంగా అందుబాటులో ఉందా.. ఉండి ఉంటే ఒక అమ్మ గుండె ఇలా తల్లడిల్లేది కాదు

అమ్మా . . నాకు క్లాస్ వినాలనుందమ్మా.. ప్లీజ్ అమ్మ.. నాకు ఒక స్మార్ట్ ఫోన్ కొనివ్వు..అంటూ ఒక పిల్లాడి అభ్యర్ధన..

ఆ మాటలు, ఆ అభ్యర్ధన గుండెల్ని పిండేస్తుంటే , ఏ తల్లికైనా కన్నీళ్లు ఆగవు. చదువుకు దూరమని పిల్లాడి బాధ. ఫోన్ కొనివ్వలేక అమ్మ వ్యధ, చదువు కోవాలనే ఆశ, చదువును కొనలేని పేదరికం, వెరసి ఓ నిండు ప్రాణం బలైపోయింది.

కరోనా మూలంగా బడులు బంద్. తోటి స్నేహితులంతా ఆన్లైన్ క్లాసులు వింటుంటే, తనకూ ఆన్లైన్ క్లాసులు వినాలని ఉందని ,ఒక స్మార్ట్ ఫోన్ కొనివ్వమని తల్లిని అడిగాడు ఆ కుర్రాడు. కానీ స్మార్ట్ ఫోన్ కొనిచ్చే స్తోమత ఆ తల్లికి లేదు. ఇప్పుడు ఫోన్ లేకపోతే చదువుకునే దారి కనపడట్లేదు. దీంతో మనస్తాపానికి గురై ప్రాణాలు వదులుకున్నాడు ఆ కుర్రాడు.

పేరు సాయి. వయసు 15 సం.. చదివేది 9వ తరగతి. ఉండేది విజయవాడ విద్యాధర పురం . బాబు తల్లి శివ పార్వతి పూల వ్యాపారంతో జీవనం సాగిస్తోంది. ఆ కుర్రాడికి 11 సంవత్సరాలప్పుడు తండి వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి అన్ని తానై చూసుకుంటోంది ఆ తల్లి. తన అరకొర సంపాదనతో పిల్లాడిని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తోంది. తనకు కొడుకే సర్వస్వముగా బతుకుతోంది ఆ శివపార్వతి. ఇటువంటి సమయంలో కరోనా లాక్ డౌన్ వాళ్ళ స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. పిల్లల చదువులు అగమ్య గోచరంగా మారాయి. ప్రభుత్వం ఒక ప్రయత్నంగా దూరదర్శన్లో తరగతుల పాఠాలు ప్రసారం చేయిస్తోంది.

సాయి కూడా దూరదర్శన్ లోని పాఠాలనే వింటూవున్నాడు. స్మార్ట్ ఫోన్ ఉంటే తరగతుల వీడియోలు యూట్యూబ్ లో కూడా చూసేవాడినని తల్లితో అనేక సార్లు చెప్తూ బాధపడేవాడు. తల్లి తన ఆర్ధిక పరిస్థితిన గురించి వివరించేది. ఒకవేళ స్కూల్స్ తెరిస్తే స్మార్ట్ ఫోన్ అవసరం ఇక ఉండదని కుడా చెప్పేది. అయినా వినని సాయి స్మార్ట్ ఫోన్ లేకపోతే తన చదువును కొనసాగించలేమని భావించి ఈ నెల 9న మధ్యాహ్నం స్నానానికని వెళ్లి బాత్ రూంలో ఒక ఇనుప కడ్డీకి ఉరివేసుకున్నాడు.

ఎప్పటికీ బయటకి రాకపోయేసరికి తల్లి తలుపు తీసిచూడగా అపస్మారక స్థితిలో ఉన్నసాయిని చూసి నిర్ఘాంతపోయి వెంటనే అంబులెన్సు కి ఫోన్ చేసిన స్పందన రాలేదు. వెంటనే ఆటోలో రెండు మూడు ప్రయివేటు హాస్పిటాల్స్ కి తిరిగింది. అయినా ఫలితం లేకపోయింది. ఎప్పుడు క్లాసులో మొదటి స్థానంలో వుండే సాయి ఇలా స్మార్ట్ ఫోన్ లేకపోవడం అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఎప్పుడూ సైలెంట్ గ వుండే సాయి ఇలాంటి పనిచేయడం అందర్నీ కలచివేసింది. సమాచారం తెలుసుకున్న భవానీపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల స్పందన

పిల్లలు ఎక్కువగా ఫోన్ లకు బానిసలు కాకుండా, వారు రోజూ వారి జీవితంలో ఏమేం చేస్తున్నారో చూడవలసిన బాధ్యత తల్లి దండ్రుల మీద చాలా ఉందని లేని పక్షంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని పోలీసులు భావిస్తున్నారు. పిల్లల సున్నిత మనస్సులు దెబ్బతినకుండా ఆన్లైన్ క్లాసుల విషయంలో వారికి నచ్చచెప్పి వారిలో ధర్యం నింపాల్సిన బాధ్యత తల్లిదండులపైనే వుంది. వీడియో గేమ్స్, ఫోన్లు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే ఇటువంటి ఘటనలు జరగవు అంటున్నారు పోలీసులు.

1 thought on “స్మార్ట్ ఫోన్.. అంత స్మార్ట్ కాదేమో ..?”

Leave a Comment