నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్.. !

ఏపీఐఐసి చైర్మన్ నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి కి నియోజకవర్గంలో తలనొప్పి తప్పటం లేదు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లలో పలువు బిసి నేతలకు పదవులు దక్కుతున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ పదవులు ఖరారు చేసినట్లుగా సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ లను నియమించేందుకు సిద్ధమైన ప్రభుత్వం, అందులో భాగంగా కార్పొరేషన్ చైర్మన్ పర్సన్ గా KJ శాంతికి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం రోజా అనుచరులకు మింగుడు పడడం లేదని సమాచారం.

గత కొంతకాలంగా వైసిపి ఎమ్మెల్యే రోజాకు, మాజీ మున్సిపల్ చైర్మన్ KJ కుమార్ వర్గాల మధ్య నగరిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలలో రోజాకి వ్యతిరేకంగా వారు పనిచేశారని.. అప్పటినుండి ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో KJ అనుచరులు అనేక సందర్భాల్లో రోజాను అడ్డుకున్నారు. ఆందోళనలు చేశారు.

కేవీఆర్ పురం గ్రామ సచివాలయం భూమి పూజకి వెళ్ళిన సమయంలో గ్రామంలోకి ప్రవేశించకుండా ఓ వర్గం వైసిపి నేతలు ఆమెను అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశాఋ. అప్పుడు రోజున సొంత పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గం కార్యకర్తలపై ఫిర్యాదు కూడా చేశారు.

ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ గా KJ కుమార్ భార్య శాంతి నియమితులు కావడం రోజాకు ఏమాత్రం నచ్చడం లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చొరవతో KJ కుటుంబానికి ఈ అవకాశం దక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. KJ వర్గానికి పదవి లభించటంతో రోజా అనుకూల వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

పార్టీ మొదటి నుంచీ

ఇక KJ కుమార్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన KJ కుమార్, వైసీపీ ప్రారంభం నుండి జగన్ వెంట నడుస్తున్నారు. స్థానికంగా KJ కుమార్ కు పట్టుంది. KJ కుమార్ 2006 నుంచి 2009 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మున్సిపల్ ఛైర్మన్గా పని చేశారు. ఆ తరువాత 2014- 2019 సంవత్సరాల మధ్య ఆయన సతీమణి శాంతి చైర్ పర్సన్ గా పనిచేశారు. కుమారు వైసిపి రాష్ట్ర బీసీ విభాగం సెక్రటరీగా, వైసిపి ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.

మొదటి నుండి నగరి రాజకీయాలపై పట్టు ఉన్న కుమార్, రోజాల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. చాలా సందర్భాలలో బాహాటంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించి ఉన్నారు. తాజాగా ఈ నిర్ణయంపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు కావాలని తమ వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి పై రోజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అయితే నగరి నేతలతో తనకి పరిచయం ఉన్నప్పటికీ.. తాను ఎటువంటి వ్యతిరేకత వర్గాలను ప్రోత్సహించటం లేదని.. KJ కుమార్ వర్గం కూడా ఎమ్మెల్యే రోజా తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి నారాయణస్వామి చెబుతున్నారు. గతంలో అనేక మార్లు రోజా మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని నగరిలో తనని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

అక్కడే తేల్చుకుంటా

ఇప్పుడు కూడా రోజా, KJ కుమార్ భార్య శాంతికి కార్పొరేషన్ పదవిని కట్టబెట్టడం పై జగన్తోనే తేల్చుకోవాలని అనుకుంటున్నారని సమాచారం. ఇక తాజాగా మరోమారు నగరిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యే రోజా వర్సెస్ KJ కుమార్ ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Leave a Comment