తెలంగాణ రాష్ట్రంలో తన రాజకీయ రంగ ప్రవేశంతో ప్రకంపనలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్న మహానేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల.. సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్రెడ్డి గారిని కించపరిస్తే ఊరుకునే స్థితిలో ప్రజలు లేరని.. వైఎస్ఆర్ గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలందరికీ వైయస్సార్ గొప్పతనం తెలుసని అన్నారు షర్మిల. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ సృష్టికర్త అని, అది మంచి పధకం కాబట్టే టిఆర్ఎస్ ప్రభుత్వం దానిని తొలగించకుండా కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు.
“వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన మంచి పథకాన్ని తొలగించే ధైర్యం మీకు లేదు.. వైయస్సార్ గురించి మాట్లాడే స్థాయి, స్తోమత, స్టాండింగ్ కూడా మీకు లేవు” అంటూ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. వైయస్సార్ మహానేత.. మనసున్న నేత.. కబడ్ధార్ కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు.
వైయస్సార్ మీలాగా కాదని, వైయస్ రాజశేఖర్రెడ్డి నిజమైన ప్రజల నేత అని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ ని కించపరిస్తే లక్షల్లో ఉన్న ఆయన అభిమానులు ఊరుకోరని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తిరగబడే రోజు వస్తుందని టీఆర్ఎస్ నేతలకు, కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చారని, బంగారు తెలంగాణ ఇస్తానని చెప్పి చివరకు రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు.
దోపిడీ చేసిందీ .. గజదొంగ లాగా మారిందీ కేసీఆర్ అని ప్రజలు అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత డాక్టర్ వైఎస్ఆర్ అని ఆయన కితాబిచ్చారు. ప్రజలు దేవుడుతో సమానంగా కొలిచే మహానేతను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని అన్నారు. తెలంగాణలో ఉన్న లక్షలాది వైయస్సార్ అభిమానులు మీకు తిరుగుబాటుతో సమాధానం చెబుతారు అని ఫైర్ అయ్యారు షర్మిల.