మోదీ సర్కార్ టార్గెట్ గా బీజేపీయేతర కూటమికి ప్రశాంత్ కిశోర్ సహకరిస్తున్నాడా.. !

మోదీ సర్కార్ టార్గెట్ గా ప్రశాంత్ కిశోర్ | ప్రస్తుతానికి దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తుంది. కేసుల సంఖ్య కూడా రోజురోజుకు భారీగా తగ్గుతోంది. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సైతం లాక్ డౌన్ కి గుడ్ బై చెప్పి తగిన జాగ్రత్తలతో వారి జీవనాన్ని క్రమంగా గాడిలో పెడుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో సైతం కరోనా కేసుల వేడి తగ్గడంతో సరి కొత్త రాజకీయ వేడి మొదలైంది.

మోదీ సర్కార్ ని గద్దె దింపాడమే లక్ష్యంగా

పీఎం మోడీ సర్కారే టార్గెట్గా 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే విపక్ష పార్టీలు పోటాపోటీగా కార్యాచరణకు రెడీ అయ్యాయి. బిజెపికి వ్యతిరేకంగా విపక్ష పార్టీల నేతలను ఏకం చేసే బాధ్యతను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రాల వారీగా ప్రత్యేక ప్రణాళికతో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారు.

తమకు పట్టున్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఘన విజయం సాధిస్తాయని.. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలతో పాటు, బిజెపిని వ్యతిరేకించే ఇతర అన్ని పార్టీలతో కలిసి ఒక ఫ్రెంట్ గా ఏర్పడి కాంగ్రెస్ మద్దతుతో 2024లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయడం సాధ్యమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రశాంత్ కిషోర్ సహకారంతో

ఈనెల 11వ తేదీన ముంబైలో శరద్ పవార్ నివాసంలో జరిగిన కీలక భేటీలో ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు. తను ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో శరద్ పవార్ కు వివరించడం జరిగిందని అంటున్నారు. పీకే తో దాదాపు మూడు గంటలపాటు సమాలోచనలు జరిపిన తర్వాత నమ్మకం కుదిరిన శరద్ పవార్.. పీకే డైరెక్షన్ లో విపక్షాలన్నీటిని ఏకతాటిపైకి తీసుకువచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడని అంటున్నారు. ( బీజేపీ సరికొత్త వ్యూహం )

అందులో భాగంగానే ఈ నెల 22న ఢిల్లీలో బీజేపీయేతర రాజకీయ పార్టీల భేటీకి అయిన శ్రీకారం చుట్టారని అంటున్నారు. అయితే ఈ భేటీకి శరద్పవార్, దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రాల వారీగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు పరస్పరం పోటీ పడకుండా బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా విపక్షాలన్ని కలిసి ఒకే పార్టీ అభ్యర్థిని బరిలో నిలపాలని.. మిగతా పార్టీలు ఆయా పార్టీల అభ్యర్థులకు అన్ని రకాలుగా మద్దతు తెలపాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్టుగా ప్రచారం జరుగుతోంది.

22వ తేదీ మంగళవారం ఉదయం ఢిల్లీలోని శరద్పవార్ నివాసంలో జరిగే ఈ సమావేశానికి దేశంలోని బిజెపియేతర, కాంగ్రెసేతర అన్ని రాజకీయ పార్టీలను శరద్ పవార్ ఆహ్వానించారని అంటున్నారు. ఈ భేటీలో మొదట కేవలం ఆయా పార్టీల ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఆహ్వానించాలని.. తిరిగి సాయంత్రం 4:00 జరిగే భేటీకి ఆయా పార్టీలకు చెందిన మిగిలిన నాయకులను సైతం ఆహ్వానించాలని అంటున్నారు. అయితే ఈ భేటీలో 2024 లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కోసమే జరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Mamatabenargee
Mamata Banerjee

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి కొంతకాలంగా చతికిలపడిందని.. ప్రస్తుతం యూపీఏ కూటమికి సోనియా గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరొక పార్టీ నుంచి దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మరో నేతను ఓటమికి నేతృత్వం వహించాలన్న ప్రచారం కూడా తెరపైకి తీసుకువస్తున్నారు. అటు శరద్ పవార్ నిర్వహించే ఈ కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల సమావేశం ముగిసిన రెండు రోజులకు.. ఇటు 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఓ కీలక సమావేశానికి పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇంఛార్జ్ లు మరియు పిసిసి అధ్యక్షులతో సోనియా కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ పద్దతిలో జరుగనుంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల అనుభవాలను ఫీడ్ బ్యాక్ రూపంలో సోనియా సేకరించనున్నారు. యువ నేతలు పార్టీని వీడుతుండటం, అంతర్గత కుమ్ములాటలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మిగతా అన్ని అంశాలు చర్చకు వస్తాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం

కేంద్రంలో బిజెపిని ఓడించడం కాంగ్రెస్ వల్ల కాదని.. దానికి ప్రాంతీయ పార్టీల సహకారం తప్పనిసరి అని, కూటమికి నేతృత్వం కూడా ప్రాంతీయ పార్టీల నేతలు వహిస్తే బీజేపీని అధికారానికి దూరం చేసేందుకైనా కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల కూటమికి బయటినుంచి మద్దతు తెలుపుతుందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో యూపీఏ చైర్పర్సన్ హోదాను సోనియా వదులుకుంటారా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గానీ.. కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి బెంగాల్ లో తిరుగు లేని నేతగా పేరుగాంచిన మమతా బెనర్జీకి గానీ యూపీఏ పగ్గాలు అప్పగిస్తారా అన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Leave a Comment