చంద్రబాబు జమిలి జపం బలంగా వినిపిస్తున్నారు. జమిలి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. 2024లో జరగాల్సిన సాధారణ ఎన్నికలు రెండేళ్ల ముందుగా 2022 లోనే జరుగుతాయి తమ్ముల్లారా.. సిద్ధంకండి అంటూ చంద్రబాబు ఉపన్యాసాలు ఇస్తున్నారు.
జమిలి ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలకే సరైన సమాచారం లేదు. వారు కూడా ఎక్కడా ఆ మాట మాట్లాడిన దాఖలాలు లేవు. మరి చంద్రబాబుకి జమిలి ఎన్నికలపై ఎందుకు అంత గట్టి నమ్మకం. దేశవ్యాప్తంగా ఒకేసారి కేంద్రం ఎన్నికలకు వెళుతుందని, అది కూడా రెండేళ్ల ముందుగానే అని చంద్రబాబు ఎందుకంత ధీమాగా చెబుతున్నారు.
అటు బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వారంతా జమిలి ఎన్నికలు వస్తే మరో రెండేళ్లలో మరోసారి ఎలక్షన్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందా.. వాస్తవానికి జమిలి ఎన్నికలు అనేవి కేంద్రం వ్యూహంలో భాగం. లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తున్నా.. ఎక్కడికక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి. మిగతా పార్టీలను బెదిరించొ, బుజ్జగించొ లేదా అప్పటికే కొలువైన కూటములను కూలదోసో తమ పైచేయి సాధించుకోవలసిన పరిస్థితి.
కేంద్రంలో స్థిరమైన మెజార్టీ ఉన్నా కూడా ఆ స్థాయిలో రాష్ట్ర ఎన్నికలలో చూపించలేకపోతోంది బిజెపి. అందుకే జమిలి ఎన్నికలకు ఆ పార్టీ సైతం సిద్హం అవుతుందనే వాదన ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక అంతర్జాతీయ అంశంతో బిజెపి ఎన్నికలను నెట్టుకువస్తుందని అపవాదు కూడా ఉంది. బీజేపీ అధికారంలో ఉండగా ఎన్నికలు వస్తున్నాయంటే.. శత్రు దేశాలతో యుద్ధం అయినా జరగాలి లేదా అభినందన్ వర్ధమాన్ లాంటి ఊహించని ఘటన అయినా జరగాలి. అలాంటివి జరక్కపోతే, దేశభక్తి అనే ఉద్వేగాన్ని వాడకపోతే బిజెపికి ఎన్నికలకు వెళ్ళినట్లే ఉండదు.
ఎవరికి బాగా కలిసివస్తుంది..
2022 నాటికి చైనా సరిహద్దు సమస్యను మరోసారి కదిలించి అయినా బిజెపి తాను అనుకున్నది సాధిస్తుందని అంటున్నారు. ఇక రామమందిరమనేది బిజెపికి బాగా కలిసొచ్చే అంశం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించినట్లే. బాబ్రీ మసీదు వివాదం కూడా చిటికెలో తేల్చేసి.. నెలల వ్యవధిలోనే అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసిన ఘనుడు ప్రధాని మోదీ.
రామ మందిరం సెంటిమెంట్ని ఎంతగా రెచ్చగొడితే హిందువుల ఓట్లు అంతలా గంపగుత్తగా బీజేపీకే పడతాయని అంచనా కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. అందుకే రెండేళ్లలో రామమందిరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలనే పట్టుదలతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలు అన్ని రకాలుగా లాభదాయకమని అంచనాకు రాబట్టే బిజెపి అధిష్టానం ఆ వైపుగా కసరత్తులు చేస్తోంది.
ఇక చంద్రబాబుకు ఈ జమిలితో వచ్చే ఉపయోగాలు ఏంటంటే.. జగన్ ని పూర్తిగా ఐదేళ్లు అధికారం లేకుండానే ఎన్నికలకు తెచ్చామని మానసికానందం ఆయనకు ఉంటుంది. అందుకే నిరాశలో కూరుకుపోయిన టిడిపి శ్రేణులకు అవకాశం దొరికినప్పుడల్లా జమిలి పేరుతో కాస్త చురక పుట్టిస్తున్నారు చంద్రబాబు. పనిలోపనిగా బీజేపీతో పొత్తు కుదిరితే తాను కూడా ఒడ్డున పడచ్చని.. మహాకూటమితో జగన్ కి చెక్ పెట్టవచ్చునని ఆలోచన చేస్తున్నారు. జమిలి ఎన్నికలపై ఎలాంటి సిగ్నల్స్ లేకుండానే మాట్లాడే అంత అమాయకుడు కాదు చంద్రబాబు. బలమైన కారణం ఉండబట్టే ఆయన పదే పదే ఈ జమిలి పాట పాడుతున్నారు.