వివాదంగా మారిన ఏపీ అసెంబ్లీ కార్యదర్శి నియామకం..

ఇప్పటి వరకూ యూట్యూర్న్ కి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా యూట్యూర్న్ వైపు వెళ్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలే ఇదేం నీతి అని ప్రశ్నిస్తున్నప్పటికి కూడా కొన్ని నియామకాల విషయంలో ప్రభుత్వం తన ఇష్టానికి ముందుకు వెళుతుంది.

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని ఇప్పుడు తిరిగి వైయస్సార్ సిపి ప్రభుత్వం అదే హోదాలో అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగా నియమించబోతోంది. ఈ అంశం ఇప్పుడు దుమారం రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు నేరుగా ప్రశ్నిస్తున్నప్పటికి కూడా ఈ నిర్ణయం జరిగిపోయిందని కూడా పెద్దలు చెబుతున్నారు అని వార్తలు వస్తున్నాయి.

సమావేశం కానున్న అసెంబ్లీ ఉద్యోగులు

అయితే టీడీపీ హయాంలో అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు తిరిగి అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శి గా.. పదవీ విరమణ చేసిన తర్వాత తీసుకురావడంపై అసెంబ్లీ ఉద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై చర్చించేందుకు అసెంబ్లీ హాల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి తిరిగి ఆ పదవిలోకి తీసుకు రాకూడదు అని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశంపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ని కలిసి కూడా వినతిపత్రం ఇవ్వాలని, ఒత్తిడి తేవాలని ఉద్యోగులు నిర్ణయించారు. అయితే ఈ నియామకం ఇంత స్థాయిలో వివాదం అవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి.

ఈ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ హయాంలో కార్యదర్శిగా ఉంటూ నాడు ఎమ్మెల్యేగా ఉన్న రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడానికి అవసరమైన ఐడియాలు ఇచ్చారు అని కూడా అప్పట్లో వైఎస్ఆర్సిపి గట్టిగా ఆరోపించింది. ఆయనకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్టు వరకు వెళ్లారు.

అప్పట్లో చాలా ఆరోపణలు ఈయన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ కార్యదర్శి పై పోరాటం చేస్తుంటే జగన్మోహన్రెడ్డి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు అంతా చప్పట్లు కొట్టి స్వాగతించారు.. ఎంకరేజ్ చేశారు. కానీ ఈ రోజు అదే వ్యక్తిని తిరిగి అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శి హోదాలో తీసుకురావడం అన్నది ఒక పెద్ద యూట్యూర్న్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నాడు గట్టిగ వ్యతిరేకించిన రామకృష్ణ రెడ్డి

నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కార్యదర్శి గురించి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక మీడియా సమావేశంలో ఏం చెప్పారు అంటే.. ” రూల్స్ ప్రకారం వెళ్లాల్సిన వ్యక్తి పచ్చ చొక్కా తొడుక్కుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారు. ఇంటర్ మాత్రమే చదివిన వ్యక్తి కార్యదర్శిగా ఎలా కొనసాగిస్తారు. అసెంబ్లీ కార్యదర్శి గా ఉండాలంటే లా డిగ్రీ ఉండాలి. ఆయనకు డిగ్రీ కూడా లేదు. మరి ఆయన్ను ఎందుకు కొనసాగిస్తున్నారు. మీరు చెప్పినట్టు చేస్తారు కాబట్టి ఆయనకు ఆ అర్హత లేకపోయినా మీరు కొనసాగిస్తున్నారు. అందుకే చర్యలు తీసుకోవడం లేదు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే గవర్నర్కు గౌరవం ఇవ్వకుండా ఈ కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ కార్యక్రమానికి ముహూర్తం దాటిపోతుందని గవర్నర్ ప్రసంగం మధ్యలో ఉండగానే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అలాంటి గవర్నర్ కి కూడా మర్యాద ఇవ్వని వ్యక్తిని కార్యదర్శిగా ఎలా కొనసాగిస్తారు” అని ఆళ్ల రామకృష్ణారెడ్డి నాడు మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఆ వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి.

నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ కార్యదర్శి పై కేసు కూడా నమోదైంది. నాంపల్లి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. మరి అలాంటి వ్యక్తి అసెంబ్లీకి కార్యదర్శిగా ఎలా కొనసాగిస్తారు అని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆ రోజు మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తరపున హైకోర్టులో ఈ కార్యదర్శికి వ్యతిరేకంగా వాదించింది ప్రస్తుతం అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న సుధాకర్ రెడ్డి.

ఒకవేళ ఇప్పుడు ఆయన్నే తిరిగి ఆ పదవిలో నియమిస్తే.. ఎవరైనా కోర్టుకు వెళితే.. మరి ఈ నియామకాన్ని ఒకవేళ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా ఉన్నా సుధాకర్రెడ్డి ఏవిధంగా సమర్ధిస్తారు. నాడు తీవ్రమైన ఆరోపణలు చేసి క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని కార్యదర్శులుగా ఎలా నియమిస్తారు అని ప్రశ్నించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి, వైసీపీ నేతలు మరి ఇప్పుడు ఆయన్ని తిరిగే అసెంబ్లీ ప్రత్యేక అధికారిగా అది కూడా ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత తీసుకొని వస్తే ఇంతకూ మించిన యూట్యూర్న్ ఉంటుందా అని ఇక్కడ అందరూ ప్రశ్నిస్తున్న అంశం.

దీనిపైనే పోరాటం చేస్తున్న ఒక వైసీపీ ఎమ్మెల్యే నిలదీస్తే.. నిర్ణయం అయిపోయింది అని కూడా చెబుతున్నారు. అంటే ఇక నియామకం దాదాపు ఖాయమయిందని అనుకోవాల్సి కూడా ఉంటుంది.

Leave a Comment