ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ (World Heritage Site ) జాబితాలో యునెస్కో (UNESCO) చేర్చింది. కాకతీయ రుద్రేశ్వర ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైసేషన్ ప్రకటించింది. కాకతీయుల నాటి శిల్ప కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ చారిత్రక కట్టడం రామప్ప.
చైనాలోని ఫ్యూజూలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లాలోని పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఈ ఆలయం, కాకతీయ శిల్పకళా వైభవంతో ఖండాంతరాలు దాటింది. జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించినా.. రష్యా సహా 17 దేశాలు ఆమోదం తెలిపాయి.
రామప్ప ఆలయ విశిష్టత అలాంటిది
వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించేందుకు తొమ్మిది లోపాలున్నట్లుగా యునెస్కో (UNESCO) బృందం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినప్పటికీ భారత ప్రభుత్వం అనూహ్య దౌత్య ప్రయత్నాల ద్వారా 24 దేశాలకు రామప్ప ఆలయ విశిష్టతను వివరించి మద్దతు కూడగట్టింది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రామప్పను నామినేషన్ లో పరిగణనలోకి తీసుకునేలా రష్యా చేసింది. అనంతరం రష్యాకు సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, ఒమన్ ,ఈజిప్టు వంటి తదితర దేశాలు మద్దతిచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ అధికారికంగా ప్రకటించారు.
మోదీ, అమిత్ షాల అభినందనలు
2020 ఏడాదికిగాను రామప్పకు ఈ హోదా దక్కింది. 2021 ఏడాది నామినీగా గుజరాత్ కు చెందిన ధోలవిరా ఆలయం వరల్డ్ హెరిటేజ్ సైట్ బరిలో ఉంది. ఇప్పటివరకు ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాలనుంచి 1121 కట్టడాలు ఉన్నాయి. ఇక తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రజలందరికీ అభినందలు తెలిపారు. కాకతీయ రాజు వంశం యొక్క అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించిన ఈ ఆలయాన్ని సందర్శించి దాని గొప్పతనం గురించి మొదటి అనుభూతిని పొందాలని నేను మీ అందరిని కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.
కాకతీయ రుద్రేశ్వర ఆలయం రామప్ప యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం యావత్ దేశానికి ఎంతో ఆనందకరమైన విషయం అని ట్విట్టర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషంగా ప్రకటించారు. ఈ దిగ్గజ ఆలయం గొప్ప భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి.. అలాగే హస్తకళలకు చక్కటి ఉదాహరణ అని ఆయన తెలిపారు. ఇది దేశం గర్వించదగ్గ క్షణం అని అమిత్ షా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో మరియు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పూర్వ వైభవానికి తెలంగాణా ప్రభుత్వం కృషి
కాకతీయ రాజులు రామప్ప ఆలయాన్ని అత్యంత సృజనాత్మకంగా కట్టారని పేర్కొంటూ తెలంగాణ చారిత్రక వైభవానికి.. ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వవైభవం తేవడం కోసం తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో.. అంటే ప్రస్తుతం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది ఈ రామప్ప దేవాలయం. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ ప్రభువైనటువంటి గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు.. కాకతీయ శివుని మీద ఉన్నటువంటి అపారమైన భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరు మీదనే ప్రాచుర్యంలోకి వచ్చింది. 800 ఏళ్ల సంస్కృతీ సంప్రదాయాలకు దర్పణం పడుతూ.. తెలంగాణ ప్రాంత చారిత్రక కీర్తిని ప్రపంచానికి చాటి చెబుతోంది రామప్ప. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువ. ఎక్కువ బరువుండే రాతి నిర్మాణాలను ఈ నేలలు తట్టుకోలేవు. అందుకే నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించారు. దీనినే నేటి ఇంజనీరు భాషలో సాండ్ బాక్స్ టెక్నాలజీగా పేర్కొంటున్నారు.
800 ఏళ్ల నాటి చారిత్రిక కట్టడం
ఆలయ నిర్మాణ స్థలంలో మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపుతారు. ఈ ఇసుక ఎప్పుడూ తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుకపై రాళ్లను నిర్మించుకుంటూ పోయి కక్షా మండపం వరకు నిర్మించారు. అప్పటి నుంచి ఆలయ నిర్మాణం చేపట్టారు. నేల స్వభావాన్ని బట్టి ఆలయం బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలు తయారు చేశారు. సాధారణ నిర్మాణంలో ఉపయోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. కానీ రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకలు కేవలం 0.8 సాంద్రతను కలిగి ఉంటాయి. అందుకే ఇవి తక్కువ బరువు కలిగి ఉండి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్న మాట.
ఈ అద్భుత ఆలయం పై కనువిందు చేసే శిల్ప సౌందర్య రాసులు, సప్త స్వరాలు పలికే స్తంబాలు, చూపరులను ఆకట్టుకునే నంది విగ్రహం, పరవశింప చేసే ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆలయ నలువైపులా ఉన్న మధనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్ గ్రానైట్ రాయిపై చెక్కబడిన మదనికల సొగసు వర్ణనాతీతం. ఇక ఆలయం నలువైపులా నాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిప్ట్, మంగోలియన్ యాత్రికుల శిల్పాలు అబ్బురపరుస్తాయి.
ఆకట్టుకునే శిల్పకళా వైభవం
ఇక ఆలయం లోపల నాట్య మండపం ఆనాటి శిల్పకళా వైభవానికి తాత్కాణంలా నిలిచిపోతుంది. సూది బెజ్జం సందులో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుతీరి ఉన్నాయి. అంతే కాదు ఆలయం బరువును మోస్తున్నట్లుగా వందలాది ఏనుగుల శిల్పాలు ఇక్కడ చెక్కారు. అయితే ఒక ఏనుగుతో మరో ఏనుగుకు సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. ఇక శివుడి ఎదురుగా ఉన్న నంది గురించి వర్ణించడానికి మాటలు చాలవు. శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లుగా.. పైకి లేవడానికి తయారుగా ఉన్నట్లుగా నందిని మలిచారు శిల్పి రామన్న.
1213లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో సుమారుగా 110 సంవత్సరాల పాటు ధూపదీప నైవేద్యాలతో వైభవంగా పూజలు కొనసాగాయి. ముస్లిం రాజుల దండయాత్రలతో కాకతీయుల ప్రస్థానం ముగియడంతో సుమారు 550 సంవత్సరాలపాటు ఎలాంటి ఆదరణ లేక అడవుల్లో, కారుచీకటిలో కమ్ముకు పోయింది. ఇక ఇప్పటికైనా ఇటువంటి అపూర్వ కట్టడాలకు పూర్వవైభవం దక్కేలా ప్రభుత్వాలు పాటుపడాలని కోరుకుందాం.