రామ మందిరానికి నేడే భూమిపూజ

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ముహూర్తం దగ్గర పడింది. మరికొద్ది గంటల్లో భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ పూజకు ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో పూజకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. బుధవారం జరిగేు భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ సహా 175 మంది ప్రముఖులను ఆహ్వానించినట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది.

బీజేపీ కురువృద్ధులు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, న్యాయవాది కె పరాశరన్, ఇతర ప్రముఖులతో వ్యక్తిగతంగా చర్చించిన తర్వాతే ఆహూతుల జాబితాను ఖరారు చేసినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ విలేఖరులకు చెప్పారు. ఆహూతుల్లో 135 మంది దాకా స్వామీజీలు, సాధువులు ఉన్నారని తెలిపారు. అయోధ్యకు చెందిన కొందరు ప్రముఖ వ్యక్తులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్మానించినట్లు ఆయన తెలిపారు. దివంగత వీహెచ్‌పీ నేత అశోక్‌ సింఘాల్‌ సమీపబంధువు సలీల్‌ సింఘాల్‌ ఈ కార్యక్రమానికి ‘యజమాన్‌’(ప్రధాన నిర్వాహకుడు) గా ఉంటారు. భూమిపూజకు సంబంధించిన ప్రత్యేక పూజాకార్యక్రమాలు సోమవారమే ప్రారంభమైనప్పటికీ భూమిపూజ శుభముహూర్తం మాత్రం బుధవారం మధ్యాహ్నం 12:44:08నుంచి 12:44ః04గంటల వరకు మాత్రమే ఉందని కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పూజారులు, మతపెద్దలు పేర్కొన్నారు.

మూడు గంటల సేపు అయోధ్యలో ప్రధాని..

కాగా ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో మూడు గంటల పాటు పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అయోధ్యకు చేరుకున్న వెంటనే ఆయన హనుమాన్‌ గడి ఆలయాన్ని సందర్శిస్తారు. మొదట అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. అనంతరం అక్కడ ఒక పారిజాత మొక్కను నాటుతారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగే భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమమంతా మధ్యాహ్నం 2 గంటలదాకా సాగవచ్చని సమాచారం. అనంతరం ప్రధాని ఢిల్లీ తిరిగి వెళ్తారు.

హనుమాన్‌ గడి ఆలయం ముస్తాబు

Lights

ఇదిలా ఉండగా ప్రధాని రాక సందర్భంగా హనుమాన్‌ గడి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయోధ్యలో శ్రీరాముడిని దర్శించడానికి ముందు హనుమాన్‌గడి ఆలయాన్ని సందర్శించడం సంప్రదాయం. ఈ సంప్రదాయానికి అనుగుణంగా ప్రధాని కూడా అయోధ్యకు చేరుకున్న వెంటనే ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

Leave a Comment