రాహుల్, ప్రియాంకల జోక్యంతో కాంగ్రెస్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు !

దేశంలో రాజకీయ పరిణామాలు తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ (రాహుల్, ప్రియాంక) ప్రయత్నాలు ప్రారంభించింది. రెండేళ్లు సైలెంట్ గా వున్న అధినాయకత్వం.. ఇప్పుడు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. 2019 ఓటమి తర్వాత తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి, తనంతట తానుగా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు రాహుల్. అప్పట్నుంచి ట్విట్టర్ వేదికగా లేదంటే ఆన్లైన్ లో మాత్రమే విమర్శలు కురిపిస్తున్నారు.ఆ విమర్శల్లో ప్రతిపక్ష నేత స్థాయిలో ఫోర్స్ కనిపించడమే లేదు.

రాహుల్ విమర్శలను లెక్కచేయని మోదీ

గతంలో రాహుల్ విమర్శలకు ప్రధాని, అమిత్ షా స్థాయిలో ప్రతిస్పందన కనిపించేది. కానీ గడచిన ఏడాది కాలంగా వారూ పట్టించుకోవడం మానేశారు. పార్టీలోనూ ఆయన పట్ల నిరాశ, నిస్పృహలు మొదలయ్యాయి. ప్రియాంక రావాలని చాలా మంది నేతలు ఆశించారు. అయితే అధ్యక్ష స్థానంలో బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె సుముఖత చూపలేదు. సోనియా సైతం రాహుల్ కే పగ్గాలివ్వాలని భావించడం వల్ల కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ఫలించలేదు. మొత్తం మీద సోనియా, ప్రియాంక కలిసి రాహుల్ ని కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది.

పార్టీ అంతర్గత విషయాలు, రాష్ట్రాల నాయకత్వంపై తాజాగా ఆయన సమీక్ష నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్లు సలహాలు, సూచనలకు పరిమితమైతే పర్వాలేదు.. కానీ పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. ఉన్న అరకొర పదవులు తమకే కావాలంటున్నారు. అధికారంలో ఉన్న చోట యువ నాయకులను ఎదగకుండా చేస్తున్నారు. అధికారం లేని రాష్ట్రాల్లోనూ పార్టీ పదవులు వీడడం లేదు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనే రాహుల్, ప్రియాంక నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ విషయంలో తీసుకున్న నిర్ణయమే అందుకు ఒక ఉదాహరణ.

రేవంత్ కి పీసీసీ ఇవ్వడంలోనూ రాహుల్

విభజన తర్వాత అధికారాన్ని పువ్వుల్లో పెట్టి తెచ్చి ఇస్తామని గొప్పలు చెప్పిన నాయకులు, కనీసం సొంత నియోజకవర్గాల్లోనూ గెలవలేక పోయారు. పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి కొత్త వాడైనటువంటి రేవంత్ కి అధ్యక్ష స్థానం అప్పగించారు. తిరుగుబాటు చేస్తామంటూ సీనియర్ నాయకులు హెచ్చరించినా ఖాతరు చేయలేదు. అసమ్మతి, ఆందోళన చేస్తే వేటు వేస్తామని హెచ్చరించారు. పరిస్థితులు వాటంతట అవే సద్దుమణిగాయి. ( రాహుల్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ )

అలాగే పంజాబ్ లో ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ బలమైన నాయకుడు. నవజోత్ సింగ్ సిద్ధూ యువతలో మంచి ఆదరణ ఉన్న నేత. సిద్ధూ అంటే పడని అమరేందర్ సింగ్, ఆయన్ను పార్టీ నుంచి బయటికి వెళ్లే పరిస్థితులు కల్పించారు. రాహుల్, ప్రియాంకలు జోక్యం చేసుకుని సిద్ధూని పీసిసి పీఠంపై కూర్చోబెట్టారు. దీంతో ముఖ్యమంత్రి దిగిరాక తప్పలేదు. రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లోనూ నెలకొన్న సమస్యలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఒకరికి ఒకరుగా కలిస్తేనే

ఇక కాంగ్రెస్ సొంతంగా కేంద్రంలో అధికారంలోకి రావడం కూడా అసాధ్యం. ప్రాంతీయ పార్టీలపై ఎలాగైనా ఆధారపడాల్సిందే. అదేవిధంగా ప్రాంతీయ పార్టీలకు, వామపక్షాలకు కూడా కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే కష్టాలు తప్పేలా లేవు. వాటిని రాజకీయంగా ఆక్రమించేందుకు మోడీ, అమిత్ షా ద్వయం చేయాల్సిందంతా చేస్తారు. ప్రాంతీయ నాయకులు అవినీతి, బంధుప్రీతి కారణంగా అనేక రకాల కేసులు ఎదుర్కొంటున్నారు.

తాము సురక్షితంగా బయట పడాలంటే కాంగ్రెస్ వంటి పార్టీ ఉండాలని వారు బలంగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ లేకుండా సొంతంగా ప్రాంతీయపార్టీలు కూటమి కట్టే అవకాశం, అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. అందువల్లే కాంగ్రెస్ పార్టీతో వాళ్లందరికీ అవసరం ఏర్పడింది. దాంతో కాంగ్రెస్ నాయకులలో తాము కొంత బలపడితే, ప్రాంతీయపార్టీలు దగ్గరకు వస్తాయనే ధీమాతో బలపడే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే రాహుల్, ప్రియాంక గతానికి భిన్నంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

1 thought on “రాహుల్, ప్రియాంకల జోక్యంతో కాంగ్రెస్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు !”

Leave a Comment