సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికలలో పార్టీల అభ్యర్థులెవరో తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. అదేంటి ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు అధికారికంగానే ప్రకటించారు కదా.. ఇందులో తికమక పడేదేముంది అనుకుంటున్నారు కదా.. మీ అనుమానం నిజమే..! కానీ ఇప్పుడు దుబ్బాకలో పరిస్థితి చూస్తుంటే ఇక్కడ పోటీచేసేది అభ్యర్థులు కాదు.. ఆ పార్టీల నేతలే అన్నట్టుగానే ఉంది.
వాస్తవానికి టీఆర్‌ఎస్ తన అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను, కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శ్రీనివాసరెడ్డిని, బీజేపీ రఘునందన్‌రావును అభ్యర్థులుగా ప్రకటించాయి. కానీ, ప్రచార ఆర్భాటాలను చూస్తుంటే పేరుకే వారు అభ్యర్థులు, కానీ పోటీ అంతా ఆ పార్టీ నాయకులదే అన్నట్టుగా తయారైంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున రాష్ట్రమంత్రి హరీష్‌రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. వీరిద్దరూ నియోజకవర్గంలోనే మకాం వేశారు. కాలికి బలపం కట్టుకొని గ్రామాలన్నీ తిరుగుతున్నారు.
వీరు చేస్తున్న ప్రచారం.. తిరుగుతున్న తీరు చూస్తుంటే వీరే ఎన్నికల్లో నిలబడ్డారా అన్నంతగా ఉంది పరిస్థితి. టీఆర్‌ఎస్ నేతలు ఊరికో నేతను ప్రచార కార్యకర్తలుగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ కూడా పీసీసీ అధినేతతో పాటు రాష్ట్రస్థాయి నేతలు, ఎమ్మెల్యేలు మండలాల వారీగా బాధ్యతలు తీసుకొని అక్కడే మకాం వేశారు. అసలు అభ్యర్థుల కంటే ముందు వీరే లేచి అభ్యర్థులను తీసుకొని ప్రచారానికి వెళ్తున్నారు. సాధారణంగా నాయకులను తమ వెంట తిప్పుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతుంటారు. కానీ, దుబ్బాకలో ఆ పరిస్థితి రివర్స్ అయింది.
ఈ ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ విజయం సాధించడం అభ్యర్థుల కంటే నేతలకే ముఖ్యమైందిగా మారింది. అందుకే అభ్యర్థికంటే ఎక్కువగా చెమటను దారపోస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాతను ప్రకటించిన తర్వాత రాష్ట్రమంత్రి, టీఆర్‌ఎస్‌లో ట్రబుల్ షూటర్, దుబ్బాక ఉప ఎన్నికల ఇన్‌చార్జి హరీష్‌రావు స్వయంగా సుజాత ఇంటికి వెళ్లి ప్రచారానికి ఆహ్వానించారంటే పార్టీ నాయకులు అభ్యర్థుల కంటే ముందుగా ఎలా కష్టపడుతున్నారో అర్ధమవుతుంది.
ఇక, రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నాయకులు కూడా దుబ్బాకలోనే మకాం ఏర్పాటు చేసుకుంటున్నారు. స్వయంగా పీసీసీ అధినేత ఉత్తమ్ కూడా ఎన్నికలయ్యే వరకు అక్కడే ఉండేలా ఓ ఇంటిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారట. ఈ పరిస్థితి చూస్తుంటే ఇక్కడ ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడుతున్నది అభ్యర్థులా..? పార్టీ నేతలా..? అన్న అనుమానం కలుగుతోందని ఆ నియోజకవర్గ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …