రాహుల్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ..జగన్ను కలుపుకుపోయే ప్రయత్నం జరుగుతోందా..!

దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వర్గాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ప్రశాంత్ వ్యూహాల ముందు రాజకీయ ప్రత్యర్ధులు అపజయాలు మూటగట్టుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. పీకే ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ తన సత్తా ఏమిటో చూపించి తాను వ్యూహకర్తగా వ్యవహరించే పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తారు. ఇటీవల ఆయన వ్యూహకర్తగా పనిచేసిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలే దీనికి ఉదాహరణ. ఆ రాష్ట్రాల్లో టిఎంసి, డిఎంకే పార్టీలు సాధించిన విజయాలు పీకే సత్తాను మరోసారి నిరూపించాయి. తన బలాన్ని బీజేపీకి మరోసారి తెలిసేలా చేశారు. ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పార్టీలకు పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇక కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

వ్యూహకర్తగా పలు విజయాలు

ఇటీవల తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో డిఎంకె, టిఎంసి గెలుపులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ ఇప్పుడు టార్గెట్ 2024గా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వంలో కాంగ్రెస్ కు, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే నేతలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారంతా ఇప్పుడు ఒక విధంగా పీకే మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారు.

అయితే ఇదే సమయంలో పీకే అనూహ్యంగా సోనియాగాంధీతో సమావేశమయ్యారు. సోనియాతో పాటుగా రాహుల్ ప్రియాంకతో కూడా ఒకే సమయంలో సమావేశమయ్యారని తెలుస్తోంది. ఆ సమావేశంలో పీకేను కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా నేరుగా సోనియాగాంధీ నుంచి ఆహ్వానం అందిందట. దీనిపై ఆయన ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా.. నో అని మాత్రం చెప్పలేదని సమాచారం. కాంగ్రెస్ లోకి వస్తే సరైన గుర్తింపు, హోదా ఇస్తామని పీకేకు సోనియా నుండి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీరి కలయిక 2024 సాధారణ ఎన్నికల గురించిన.. లేక వేరే ఇంకేమైనా వ్యూహాలు రచిస్తున్నారా అన్న విషయంపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

బిజెపిని ఓడించడమే లక్ష్యంగా

2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యంగా పీకే పనిచేస్తున్న నేపథ్యంలో.. పికె కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల నేతల నుండి ప్రశాంత్ కు ఒక విధంగా అంగీకారం లభించింది. దీంతో ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకం కానున్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీస్తే 2024 ఎన్నికల లక్ష్యంలో తొలి విజయం సాధించినట్లేనని కాంగ్రెస్ భావన. అందులో భాగంగా ఇప్పటి నుంచే ఆయనకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కనిపిస్తోంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం లేదని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు రాజకీయంగా ఒక లక్ష్యం, కసితో పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఏ విధంగా అయినా బిజెపి తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాకుండా పనిచేసేందుకు అన్ని అవకాశాలను వినియోగిస్తున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలే గాంధీ కుటుంబాన్ని ఆకర్షించాయి. పీకే చెప్పిన అంశాలు, వ్యూహాలతో పాటుగా కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా పీకే సూచించినట్టు తెలుస్తోంది.

బిజెపి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్లాలని ఇప్పటికే శరద్ పవార్ సూచన చేశారు. దీంతో ఇక పీకే బీజేపీని అడ్డుకునేందుకు మరో జాతీయ పార్టీలో చేరి ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఏపీలో జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు పీకే. ఆ అనుబంధం తో ఇప్పుడు జగన్ ను సైతం తమ కూటమి వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ జగన్, తనను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్తో కలుస్తారా అన్నది కూడా ప్రశ్నే.

ప్రత్యేక హోదా ఇస్తరా

అయితే ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ పార్టీ మద్దతు అవసరమైతే సహకరిస్తామంటూ గతంలో చెప్పిన మాటను గుర్తుచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ తో ఆ ప్రకటన చేయించి జగన్ ను కలుపుకుపోయే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి జగన్ కు 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు ముగ్గురు తగ్గినా ఎక్కువ మంది ఎంపీలు జగన్ కు ఉండొచ్చనేది వారి ఆలోచన. అంత మంది ఎంపిలు కాంగ్రెస్ కీలకమే కాబట్టి జగన్ కోసం సోనియా ఓ మెట్టు దిగి ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే గనుక జరిగితే 2024 ఎన్నికల తర్వాత జగన్ కేంద్రాల్లో చక్రం తిప్పే అవకాశం లేకపోలేదు.

Leave a Comment