అమరావతి ఉద్యమానికి ఎవరు అడ్డంకి ..?

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన వాళ్లు ఉద్యమ బాట పట్టారు.

ఈ ఉద్యమ ప్రస్థానం ఇప్పటికే 300 రోజులు పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ సమయాన్ని కూడా ఇందులో కలిపేసుకున్నారు. సరే అది వేరే సంగతి అనుకోండి. ఏ ప్రాంత రైతులకైనా అన్యాయం జరిగితే వ్యతిరేకించాల్సిందే. అందులో రెండో మాటకు తావులేదు. కానీ రాజధాని అమరావతి రైతులది ప్రత్యేక పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వంతో వారు రియల్ ఎస్టేట్ వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు అదే వాళ్ల పాలిట మరణశాసనం అయింది.

గత 300 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు కర్త కర్మ క్రియగా మారి ఉద్యమాన్ని తమ ఎల్లో మీడియా ద్వారా హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్రమంతా నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విషాదమేంటంటే ఈ ఉద్యమానికి రాజధాని ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాల నుంచి కనీస మద్దతు కూడా లభించలేదు. ఒక్క టీడీపీ, సిపిఐ మినహా మిగిలిన ఏ ఒక్క పార్టీ కూడా తమ సంఘీభావాన్ని ప్రకటించలేదు.

దీన్నిబట్టి అమరావతి ఉద్యమంపై ఆయా రాజకీయ పార్టీల వైఖరెంటో నిన్నటి ఎపిసోడ్ తో మరింత స్పష్టత వచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రయోజనాలతో రాజధాని అంశం ముడిపడి ఉందని రాష్ట్ర ప్రజలు, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు నమ్ముతూ ఉండడం వల్లే వాళ్ల నుంచి మద్దతు రావడం లేదనే వాస్తవాన్ని రాజధాని ప్రాంత ఉద్యమకారులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కనపడని పార్టీ పెద్దలు

అమరావతి ఉద్యమానికి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షమైన జనసేన, సిపిఎం పార్టీలు దూరంగా ఉండడం గమనార్హం. జనసేన గుడ్డిలో మెల్లగా ఒకట్రెండు చోట్ల కార్యక్రమాల్లో పాల్గొని తమ హాజరు వేయించుకోవడానికి అన్నట్టు వ్యవహరించిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి ఉద్యమం విషయంలో వామపక్షాలలో విభజన వచ్చిన విషయం తెలిసిందే. అమరావతి ప్రాంతంలో జరిగిన ఉద్యమంలో ఆ ప్రాంత సిపిఎం నాయకుడు బాబురావు మాత్రమే పాల్గొనడం గమనార్హం.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఇతర నాయకులు కనీసం ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు. ఇక సీపీఐ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. టిడిపి ప్రయోజనాలే పరమావధిగా ఆ పార్టీ నేతలు నారాయణ, రామకృష్ణ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వీళ్లిద్దరు వ్యవహారాలపై సొంత పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నిన్న తిరుపతిలో చేపట్టిన అమరావతి పరిరక్షణ సమితి సంఘీభావ దీక్షలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అమరావతి, ప్రత్యేక హోదా తెచ్చే పార్టీలకే మద్దతు ఇస్తామని ప్రకటించారు.

విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో ఆ పార్టీ నాయకుడు పోతిని మహేష్ పాల్గొన్నారు. ఇంతకు మించి పార్టీ అగ్ర నాయకులు ఎవరు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనక పోవడం విశేషం. తమ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపకపోవడం పై అమరావతి ప్రాంత రైతులు మండిపడుతున్నారు. గతంలో ఇంచు కూడా కదలనివ్వమని ప్రగల్భాలు పలికిన సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి.

ఇటీవల జాతీయ స్థాయిలో పదవి దక్కించుకున్న పురంధేశ్వరి కూడా ఎక్కడా కనిపించలేదు. అమరావతి విషయంలో జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వైఖరి మొదటి నుంచి ఒకే రకంగా ఉంటుంది. తమకు అధికారం అప్పగిస్తే ఎన్ని రాజధానులు ఉండాలో తేల్చి చెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. అందుకే ఆయన నేతృత్వంలో ఏపీ బీజేపీ నేతలు ఎంతో క్రమశిక్షణగా అమరావతి ఉద్యమానికి దూరంగా ఉన్నారు. 300 రోజులు గడిచే సరికి అమరావతి పై ఎవరి అభిప్రాయాలు ఏంటో ఒక స్పష్టత వచ్చింది.

అమరావతి ఉద్యమ నిర్మాత చంద్రబాబు కేవలం ట్వీట్లకు పరిమితం కావడం అత్యంత విషాదం. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. ఇందులో 14 ఏళ్ళ పరిపాలన అనుభవం తనకు ఉన్నాయని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఈ ఉద్యమంలోకి అందరూ వచ్చేలా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అన్నిటికి మించి చంద్రబాబే ఈ ఉద్యమానికి పెద్ద అద్దంకి కావడం రాజధాని ప్రాంత రైతులు చేసుకున్న దురదృష్టంగా చెప్పక తప్పదు. అమరావతి ఉద్యమ ప్రస్థానంలో చంద్రబాబు అసమర్థ నాయకత్వం బయటపడింది. అందుకే మొదట్లో ఉన్న మద్దతు కూడా ఇప్పుడూ కరువైంది.

Leave a Comment