రాష్ట్రంలో కరోనా కేసులు అప్పుడే నమోదవుతున్న సమయంలో కరోనా ముంచెత్తుతోంది అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాడు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని నాడు తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా ప్రతినిధుల బృందం పెద్ద ఎత్తున కీర్తించింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక గొప్ప విజినరీ అని.. కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేసారని అంటూ ప్రచారం చేశారు. నిబంధన ప్రకారం ఎన్నికల వాయిదా వేయాల్సి వస్తే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాడు అది కూడా చేయలేదు. వ్యవహారం కోర్టులో చేరి పరిష్కారం వచ్చేలోపు కరోనా తాండవం మొదలైంది. కరోనా విజృంభణ మొదలు కాకముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అప్పుడే నిర్వహించి ఉంటే బాగుండేది అని ఇప్పుడు చాలా మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
రాష్ట్రంలో ఒకటి రెండు కరోనా కేసులు నమోదు సమయంలోనే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేస్తే ఆయన విజనరీ, ముందుచూపు ఉన్న వ్యక్తి అని కీర్తించిన వారు.. ఇప్పుడు ఒక యూ టర్న్ తీసుకున్నారు. నాడు ఎన్నికలు వాయిదా వేయడమే కరెక్టు అని వాదించిన టిడిపి పత్రికలు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందంటూ రోజుకు ఐదారు వేల కరోనా కేసులు నమోదవుతున్న ఈ తరుణంలో ప్రశ్నిస్తూ కథనాలు రాశాయి. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి అనేది టిడిపి ఆకాంక్ష అని ఆ పత్రికల కధనాలను బట్టే స్పష్టంగా అర్థమవుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అయినా సరే ఎన్నికలు ఏపీలో నిర్వహించడానికి వీల్లేదని అడ్డుపడిన టిడిపి ఇప్పుడు ఇలా ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేయడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న ఇబ్బంది ఏమిటి అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో టిడిపి పత్రిక ఎన్నికల సంగతి ఏంటి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ భారీగా కధనాలు రాసింది. తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని వైసిపి ఆరోపిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 31తో ముగిసిపోతోంది. కాబట్టి నిమ్మగడ్డ ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే కొన్ని విషయాలలోనైనా పైచేయి ఉంటుందని టీడీపీ భావిస్తూ ఉండొచ్చు. నచ్చని అధికారులను ఈసి ద్వారా బదిలీ చేయడం, అధికారులపై నిమ్మగడ్డ ద్వారా కర్ర పెత్తనం చేయడం వంటివి చేయవచ్చు అని తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉండొచ్చు.
నిమ్మగడ్డ పునర్నియామకం జరిగిన వెంటనే టీడీపీ అనుకూల మీడియానే, వారి అసలు ఆలోచన కూడా అప్పట్లోనే బయటపెట్టేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా వైసిపి వారు ఏకగ్రీవమైన నేపథ్యంలో వాటిని రద్దు చేయించి మొదటినుంచీ ప్రక్రియ మొదలు పెట్టే యోచనలో కూడా నిమ్మగడ్డకు ఉందని గతంలోనే టీడీపీ మీడియా రాసింది. నిమ్మగడ్డ హయాంలోనే ఎన్నికలు నిర్వహిస్తే ఏకగ్రీవాలు కూడా రద్దు చేయడం సాధ్యం అవుతుందని టిడిపి ఆలోచిస్తూ ఉండవచ్చు.
అన్నింటికీ మించి రానురాను తెలుగుదేశం రాజకీయ పరిస్థితి మరింత గందరగోళంగా తయారవుతోంది. వచ్చే ఏడాది జనవరిలో అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా లక్షలాది మంది మహిళల ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. అదే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి తలకిందులు అవుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉండవచ్చు.
ఏది ఏమైనా నాడు ఒక వారం పది రోజులు ఓపిక పట్టి ఎన్నికలు నిర్వహించి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారంతో పాటు ఈ గందరగోళం రాష్ట్రంలో ఉండేది కాదు. కానీ నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా చేసిన ఒక తప్పిదం వల్ల రాష్ట్రం చాలా గందరగోళం ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఒక కరోనా కేసు ఉన్నప్పుడు ప్రజలను రక్షించేందుకు ఎన్నికలు వాయిదా వేశారని ప్రకటించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇప్పుడు వేల సంఖ్యలో రోజూ కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో.. ఎన్నికల నిర్వహణకు ఒకవేళ అంగీకరిస్తే అప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి.