జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఏపీ హైకోర్టులో 325 పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం అడుగు ముందుకు వేయకుండా అడ్డుకునేందుకే ఒక రాజకీయ పార్టీ కనుసన్నల్లో ఈ పిటిషన్లు దాఖలవుతున్నాయని అధికార పార్టీ ఆరోపిస్తూ వచ్చింది.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులు వంటి వాటి పైనే కాకుండా చిన్నచిన్న అంశాలపైన వందలాది పిటిషన్లు దాఖలు అవుతూ వచ్చాయి. ఈ ధోరణి చూసిన తర్వాత ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉండడానికి వీల్లేదని కూడా పిటిషన్ వేసేలా వున్నారు అంటూ సోషల్ మీడియాలో ఆ మధ్య జోకులు కూడా వేశారు. ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చింది.
జగన్ మోహన్ రెడ్డి ఏ అధికారంతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారని ప్రశ్నిస్తూ ఒక పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ పదవి నిర్వహించకుండా నిలువరించవలసిందిగా కోరుతూ గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం కి చెందిన ఆలోకం సుధాకర్ బాబు అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తిరుమలకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదని, ఇలా చేయడం ద్వారా దేవాదాయ చట్టంలోని పలు సెక్షన్లను ఉల్లంఘించారంటూ పిటిషన్ వేశారు.
Latest More Articles Click here
చట్టాలను ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి ఏ అధికారంతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారో వివరణ కోరాలని అటు హైకోర్టులో కోవారెంట్ పిటిషన్ దాఖలు చేశారు సుధాకర్ బాబు. ముఖ్యమంత్రితో పాటు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, మంత్రి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు టీటీడీ ఈవో అనిల్ నుంచి కూడా వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, టిటిడి చైర్మన్, ఈవోలు వారి వారి బాధ్యతలు నిర్వహించకుండా నిలువరిస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. పిటిషనర్ వాదన ఎలా ఉన్నా ఇలాంటి పిటిషన్లు కొన్ని పరిణామాలకు దారితీయవచ్చు.
ఇలాంటి అంశాల పైన పిటిషన్ ఏకంగా ముఖ్యమంత్రిని బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుకోండి అని కోరడం ద్వారా జగన్ ప్రత్యర్థుల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో ప్రజలకు అర్థమయ్యే ఉంటుంది. పనిగట్టుకుని చిన్నచిన్న అంశాలపైన కోర్టులో పిటిషన్లు వేస్తున్నారన్న ప్రభుత్వ వాదనకు మరింత బలం చేకూర్చేందుకు ఈ తరహా పిటిషన్లు ఉపయోగపడతాయి భవిష్యత్తులో సీరియస్ అంశాలపైనా పిటిషన్ వేసినా, ప్రజలు వాటిని కూడా ఈ తరహాలోనే భావించే అవకాశం ఉంటుంది. డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి ముఖ్యమంత్రిని విధులు నిర్వహించకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.