చర్చనీయాంశంగా మారిన మరో లేఖ

ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ పనితీరు పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది గత నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై నెల రోజులుగా స్పందించని సుప్రీంకోర్టు ఇవాళ దానిని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది.

ఓ వైపు హైకోర్టు వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు జస్టీస్ కు సీఎం జగన్ రాసిన లేఖపై దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో.. అంతకంటే ముందే హైకోర్ట్ పై దాఖలైన ఫిర్యాదును సుప్రీంకోర్టు పిల్ గా స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ లేక కంటే ముందే దాదాపు అదే ఆరోపణతో దాఖలైన ఫిర్యాదు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ జరుపబోతోంది.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరు పై హైకోర్టు ఈ మధ్యకాలంలో తీవ్రంగా స్పందిస్తోంది. ఏపీఎస్ కార్పస్ పిటిషన్లు, సిఐడి కేసులు, ఇతర నిబంధనల ఉల్లంఘన కేసుల్లో పోలీసుల పనితీరు పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో ఓ కేసు విచారణ సందర్భంగా పోలీసులను నియంత్రించ లేకపోతే మీ పదవికి రాజీనామా చేయాలంటూ హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

పదేపదే పోలీసుల పనితీరు వివాదాస్పదమవుతున్న తరుణంలో హైకోర్టు అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర డిజిపిని హైకోర్టుకు పిలిపించడంతోపాటు, న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం పై చర్చ జరిగింది. అయితే అప్పట్లో డీజీపీ కూడా కోర్టుకు తగిన వివరణ ఇవ్వడంతో వివాదం మొత్తం సద్దుమణిగింది.

డీజీపీని ఉద్దేశించి పోలీసు వ్యవస్థను నియంత్రిస్తారా లేక మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతారా అంటూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన న్యాయవాది కోటేశ్వరరావు ఏకంగా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశారు. ఇందులో కోటేశ్వరరావు హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇస్తున్న ప్రతికూల తీర్పులు, వాటి పర్యవసానాలు, మీడియా కవరేజ్ జూనియర్ లాయర్లు సైతం హైకోర్టులో పిటిషన్ వేసి ఎలా తమకు కావాల్సిన ఉత్తర్వులు పొందుతున్నారో పూసగుచ్చినట్లు వివరించారు.

పలు కేసుల్లో న్యాయమూర్తుల వ్యాఖ్యలు, వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ వాటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల వ్యవహార శైలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తున్న తీర్పులతో పాటు పలు అంశాలపై కూడా గత నెలలో చీఫ్ జస్టీస్ కు ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఇవాళ స్పందించింది. ఈ ఫిర్యాదుని పిల్ గా స్వీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. పిల్ పై త్వరలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల పై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం రూపంలో విచారణ చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే తాజాగా సీఎం జగన్ కూడా ఇవే ఆరోపణలతో చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు లేఖ రాసిన నేపథ్యంలో ఈ పిల్ ప్రాధాన్యత సంతరించుకుంది. వైయస్ జగన్ లేక కంటే ముందు వచ్చిన ఈ లేఖ ఆధారంగా ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిగితే గనక ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారడం ఖాయంగా కనబడుతుంది. ఏదైనా ఆచితూచి అడుగులు వేయడంలో జగన్ ప్రభుత్వం ముందే వుంది అని చెప్పవచ్చు. తేరా వెనుక పనులవల్ల ఈ రచ్చకు కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

1 thought on “చర్చనీయాంశంగా మారిన మరో లేఖ”

Leave a Comment