కేసీఆరే రంగంలోకి దిగారంటే..!

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందా..? రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలవడం కష్టమని భావిస్తున్నారా..? ఎవరిని నమ్ముకున్నా లాభం లేదనుకున్నారా..? అందుకే ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారా..? అన్న అనుమానాలు తెలంగాణ ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

వచ్చే నెల మార్చితో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలు– నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు ఖాళీ కానున్నాయి. ఈ రెండు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో టీఆర్‌ఎస్‌ నేతలున్నారు. సాధారణ ఎన్నికల్లో నల్లేరుపై నడకలా సాగిన టీఆర్‌ఎస్‌ విజయ ప్రస్థానం ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే సరికి బోల్తా పడుతున్నారు.

ప్రధానంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. కొంతకాలం క్రితం జరిగిన కరీంనగర్‌ పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. ఇక నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ బలపర్చిన పీఆర్‌టీయూ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌పై యూటీఎఫ్‌ అభ్యర్థి నర్సిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఇలా ప్రతిచోటా టీఆర్‌ఎస్‌కు విముఖతే ఎదురవుతోంది. దీంతో ఇప్పుడు రెండు స్థానాలకు జరిగే ఎన్నికలను టీఆర్‌ఎస్‌ సవాల్‌గా తీసుకుంది. ఓటర్ల చేర్పింపు మొత్తాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులంతా అదేపనిలో ఉన్నారు. స్వయంగా కేటీఆర్‌ జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అయినా, టీఆర్‌ఎస్‌ అధినేతకు ఇంకా అనుమానాలు ఉన్నట్టుగా భావిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

ఈ ఎన్నికల ఇతరులకు అప్పగించి మరోసారి ఓటమిని తెచ్చుకోవాల్సి వస్తుందేమోనని భావనలో ఉన్న కేసీఆర్‌.. తానే రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తమకు రాజకీయ ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని భావించే కేసీఆర్‌ ఇక రంగంలోకి దిగారన్న వాదన వినిపిస్తోంది.

అందులో భాగంగానే శనివారం కేసీఆర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం గురించి చర్చించేందుకు ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి గులాబీ బాస్‌కు చెమటలు పట్టిస్తున్నాయని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ అధినేత నుంచి కిందిస్థాయి వరకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా చివరకు ఫలితాలు ఎలా వస్తాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment