ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లో ….

భారత దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రతి రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు వైరస్ కట్టడికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే వుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ విధిస్తున్నాయి.

అయితే.. రాష్ట్రాల మధ్య రాకపోకల కారణంగా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల సరిహద్దులలో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఏపీలో రోజుకు ఇరవై వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాలు ఏపీ నుండి రాకపోకలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ( డిజిటల్ బిజినెస్ హబ్ గా టాటా .. )

ఏపీతో సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఒడిశా, కర్ణాటకలో లాక్ డౌన్ ఇప్పటికే అమలవుతుండగా తమిళనాడులో త్వరలోనే సంపూర్ణ లాక్ డౌన్ మొదలుకానుంది. ఇదిలా ఉండగా ఒడిశా ప్రభుత్వం అధికారికంగానే ఏపీ నుండి రాకపోకలపై నిషేధం విధించింది. అందుకు గాను సరిహద్దులో చెక్ పోస్టులతో పాటు రెండు రాష్ట్రాల మధ్య రోడ్డు సంబంధాలను తెంపేసింది. రోడ్డును జేసీబీ యంత్రాలతో తవ్వించేసి వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది.

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు గ్రామాల్లో ఒడిశా అధికారులు రోడ్లు తవ్వేసి తమ రాష్ట్రానికి రావద్దని కఠినంగా హెచ్చరించారు. మెళియాపుట్టి – ఒరిస్సా సరిహద్దు గ్రామాలైన బిన్నాల, అగర్ఖండిలలో అధికారులు దగ్గరుండి మరీ జేసీబీలతో రోడ్లు తవ్వించి సంబంధాలను తెంపేశారు.

ఆంక్షలు అతిక్రమించి తమ రాష్ట్రంలోకి వచ్చే వారిపై కఠినంగా వ్యహరిస్తామని హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు శ్రీకాకుళం జిల్లా నుండి తమ రాష్ట్రంలోకి వచ్చేవారికి తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు.

Leave a Comment