కొత్త జిల్లాల ఏర్పాటు ఆపండి. . నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ..

ఏపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా శాసించేందుకు ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఏపీ ప్రభుత్వంతో వివాదాలు పెట్టుకొని కోర్టుకు వెళ్ళిన నిమ్మగడ్డ, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలను నిలువరించేందుకు సిద్ధమయ్యారు.

పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు పై వేగంగా ముందుకెళ్తుండగా.. ఆ ప్రక్రియను అడ్డుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు వచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆపండి అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్య లోనే ఉందని.. ఈ సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు సరికాదని ఆయన తన లేఖలో తెలియజేశారు. 13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టామని, కాబట్టి ఎన్నికలు పూర్తయ్యే వరకు 13 జిల్లాలే ఉండాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికలు నిర్వహించే వరకూ కొత్త జిల్లాల ఏర్పాటు పై నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించారు.

కొత్త జిల్లాల ఏర్పాటును అడ్డుకునేందుకు నిమ్మగడ్డ లేఖ రాయడం.. ఏపీలో అభివృద్ధి పనులకు ఈసీ నుంచి అనుమతి తీసుకోండి, ఒకవేళ ఈసీ అడ్డుపడితే తమను ఆశ్రయించండి అని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో టీడీపీ అనుకూల రెండో పత్రిక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ చేతికి చిక్కింది అంటూ ఆ పత్రిక కథనాన్ని రాసింది.

ఇకపై ప్రభుత్వం కొత్తగా పథకాలు ప్రవేశ పెట్టాలన్నా.. వాటిని వివరించి లబ్ధిదారుల ఎంపిక వివరాలను ఈసీకి తెలియజేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని.. ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ చేతిలో చిక్కిందని ప్రత్యేకంగా టిడిపి పత్రిక రాసింది. కొత్త జిల్లాల ఏర్పాటును ఆపండి అని ఆదేశించడం.. ఈసీ చేతిలో ఏపీ ప్రభుత్వం చిక్కిందని టీడీపీ మీడియా ప్రచారం చేయడం ఒక విధంగా ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని.. ప్రజల తీర్పును అవహేళన చేసినట్లుగానే ఉంది.

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా సరే, ఈసీ ద్వారా తామే పరిపాలనను శాసిస్తామని అన్నట్లుగా ఏపీలో తెలుగుదేశం పార్టీ వ్యవహారం నడుస్తోంది. తాను చెప్పినట్లు ఎన్నికలకు అంగీకరించకపోతే తాను ఉన్నంతకాలం ప్రభుత్వాన్ని అడుగు ముందుకు వెయ్యనీయబోనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఈ వ్యవహారం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఒక్కో లోక్సభ స్థానాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేసింది. సోమవారం జగన్మోహన్రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు పై సమీక్ష నిర్వహించారు. అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆపండి అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేక రాయడం బట్టి రాష్ట్రంలో పరిపాలన శాసించడం తోపాటు ప్రభుత్వంతో వివాదాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆహ్వానిస్తున్నారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Comment