ఏకగ్రీవాలపై పంతాన్ని నెగ్గించుకున్న జగన్ సర్కార్.

ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ సర్కార్ ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకుందనే చెప్పాలి. ఇదే సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఏకగ్రీవాలను పెండింగ్లో పెట్టి వివాదాన్ని కొనసాగించకుండా ఒక మెట్టు కిందకు దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎట్టకేలకు గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు సమాచారం అందించారు. మరో రెండు రోజుల్లో ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 525 మంది సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 110 మంది, గుంటూరు జిల్లాలో 67 మంది సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యారు. ( హైకోర్టులో నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ … ! )

ఈ ఏకగ్రీవాలు ప్రకటించకుండా పక్కకు పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ సంబంధిత జిల్లా అధికారులను రెండురోజుల క్రితం ఆదేశించారు. నిమ్మగడ్డ నిర్ణయం పై అధికార పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక దశలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలను పట్టించుకోకుండా ఫలితాలను ప్రకటించాలని కొందరు మంత్రులు డిమాండ్ కూడా చేశారు.

ఈ నేపథ్యంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికాగానే కౌంటింగ్ చేపడతారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్ లను కూడా ఎన్నుకుంటారు. దీంతో ఏకగ్రీవాలపై నెలకొన్న ఉత్కంఠకు నిమ్మగడ్డ తెరదించారు. ఏకగ్రీవాలపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికార పార్టీ తన పంతం నెగ్గించుకున్నట్లయింది.

Leave a Comment