దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తరచుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీగా వ్యయప్రయాసలు తప్పడం లేదని భావిస్తున్న కేంద్రం, ఈ దిశగా న్యాయ కమిషన్ చేసిన సిఫారసులు పరిశీలిస్తున్నట్లు ఈరోజున వెల్లడించింది. దీంతో జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేంద్రం చేసిన ప్రకటనపై వివిధ రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అయితే ఎప్పటికల్లా ఈ జమిలి ఎన్నికలు ఉండొచ్చు అనేదానిపై మాత్రం కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు.
NDA అధికారంలోకి వచ్చిన ప్రతిసారి జమిలి ఎన్నికల ప్రస్తావన
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ వ్యవహారం కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా NDA సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దీనిపై చర్చ మొదలైంది. ప్రధాని మోడీ మానసపుత్రికగా భావిస్తున్న వన్ ఇండియా వన్ నేషన్ ను ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా న్యాయ కమిషన్ సిఫార్సులతో ఈ వ్యవహారం ఎప్పటికప్పుడు తెరపైకి వస్తుంది. ఇప్పుడు తాజాగా మరోసారి కేంద్ర న్యాయశాఖ మంత్రి Kiren Rijiju ఈ వ్యవహారంపై స్పందించారు. దీంతో జమిలి ఎన్నికలపై మరో సారి చర్చ మొదలైంది. ఎప్పుడు జరుగుతాయో తెలియకపోయినా, జమిలి ఎన్నికలైతే ఉంటాయని సంకేతాలను కేంద్రం పంపినట్లయింది.
జమిలి ఎన్నికలపై తాజాగా స్పందించి న్యాయశాఖ మంత్రి Kiren Rijiju కేంద్రం దీన్ని పరిశీలిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా తరచుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వంపై భారం పెరుగుతుందని.. అందుకే వివిధ రాజ్యాంగ సంస్థల సిఫారసుల మేరకు జమిలి ఎన్నికల్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు Kiren Rijiju తెలిపారు. లోక్ సభలో ఎంపీ ప్రదీప్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా Kiren Rijiju చెప్పిన అంశాలపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఎన్నికలు తరచుగా జరగడం వల్ల సాధారణ ప్రజా జీవితానికి కూడా ఇబ్బందులు కలుగుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ( ఇప్పుడు యోగీ కూడా )
కేవలం ఎన్నికల ఖర్చు తగ్గించడానికేనా
దేశ వ్యాప్తంగా 2014 – 19కి మధ్య జరిగిన ఎన్నికలకు 5814 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. లోక్సభతో పాటే ఈ ఎన్నికలన్నీ జరిగి ఉంటే ఇంత ఖర్చు అయ్యేది కాదని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పెరుగుతున్న ఖర్చులు దృష్టిలో ఉంచుకొని జమిలి ఎన్నికలకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు న్యాయశాఖ మంత్రి Kiren Rijiju తేల్చిచెప్పారు. ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించడం ద్వారా ఏటేటా వాటిపై పడే భారం తగ్గుతూ వస్తోందని, పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా తన సిఫార్సులో పేర్కొందని Kiren Rijiju గుర్తు చేశారు. ఈ సిఫార్సుని మరింత లోతుగా పరిశీలించి అభిప్రాయాలు చెప్పాలని న్యాయ కమిషన్ కు పంపినట్లు వెల్లడించారు. దీంతో లా కమిషన్ కూడా వివిధ వర్గాలను సంప్రదించి 244, 255 నివేదికలలో జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. ( కెసిఆర్ ప్లాన్ ఫలిస్తుందా )
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం.. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్న నకిలీ ఓట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ఆధార్ కార్డుని ఓటర్ కార్డుకు లింక్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదించే అవకాశం ఉంది. అదే జరిగితే నకిలీ ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోతుందని భావిస్తున్నారు. దీంతో ఒకే వ్యక్తి విభిన్న ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెరపైకి తెస్తున్నా.. అవి ఎప్పుడు జరుగుతాయి అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
2022 లేదా 2023 న జమిలి ఎన్నికలు
2022 లేదా 2023 న జమిలి ఎన్నికలు ఉండవచ్చనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే వచ్చే ఏడాది యూపీ, ఉత్తరాఖంఢ్, పంజాబ్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితోపాటు మరికొన్ని రాష్ట్ర అసెంబ్లీల గడువు కూడా తీరిపోనుంది. దీంతో జమిలి ఎన్నికలను వచ్చే ఏడాది చివర్లో లేదా 2023లో నిర్వహిస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజకీయ పార్టీలు దీనికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు NDA సర్కార్ పావులు కదుపుతున్నా.. దీనిపై విపక్షాలు మాత్రం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూపీఏ పెద్దలతో పాటు తాజాగా వారికి మద్దతుగా మారుతున్న మమతా బెనర్జీ, పవార్ వంటి వారు కూడా జమిలి ఎన్నికలకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ( వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ )
గతంలో జెమిని ఎన్నికల వల్ల నష్టం జరుగుతుందన్న కారణంతో కెసిఆర్ వంటి వారు ముందస్తు ఎన్నికలకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఎంపీలతో లింక్ చేసుకుని వెళ్లడం ద్వారా ఎమ్మెల్యేలను గెలవడం కష్టమనే భావన ముఖ్యంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలలో నెలకొంది. జాతీయ పార్టీలు మాత్రం కొంతమేర జమిలికి అనుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ జమిలి ఎన్నికలతో ప్రజావ్యతిరేకతను తప్పించుకునేందుకే మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెమిని ఎన్నికల ప్రతిపాదనకు విపక్షాలు ఎంతమేరకు సహకరిస్తాయనే దానిపై చర్చ కూడా సాగుతోంది. అయితే విపక్షాలు సహకరించినా, సహకరించకపోయినా లా కమిషన్ సిఫార్సుల ప్రకారం జమిలి ఎన్నికలకు ముందడుగు వేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా తాము రాజ్యాంగబద్ధంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రజల్లోకి సంకేతాలు పంపాలని మోడీ సర్కార్ భావనగా తెలుస్తోంది.