పంచ్ డైలాగులతో పనులు కావు లోకేష్ బాబు

లోకేష్ అంటే కేరాఫ్ చంద్రబాబే అని ఈరోజుకూ చెప్పాలి. జనాలకు కూడా అలాగే అర్థమవుతోంది. ఇక పార్టీ వారి సంగతి కూడా అంతే మరి. జగన్ మీద గట్టిగా విమర్శలు చేయడం వల్ల లోకేష్ స్థాయి ఏమాత్రం పెరగదు. పైగా లోకేష్ ఒక ట్విట్టర్ పిట్ట అని ముద్ర కూడా పడింది. మామూలుగా చెప్పాలి అంటే టిడిపిలో గ్లామర్ ఫేస్ ఉన్నది ఒకరికే. ఆయనే దివంగత ఎన్టీఆర్. తన తరువాత చంద్రబాబు తన వ్యూహాలతో, చాతుర్యంతోతోనే ఇంత కాలం పార్టీని నడిపారు. చంద్రబాబుకి గ్లామర్ లేకపోయినా పొలిటికల్ గ్రామర్ చాలా ఉంది. అన్నిటికీ మించి ఎవరిని ఎలా గుప్పెట పెట్టాలో తెలిసిన చాతుర్యం బాబు సొంతం. ( Lokesh tweet miss fire)

లోకేష్ లో ఆ చతురత ఉందా

ఇక లోకేష్ దగ్గరకు వస్తే అటు గ్లామర్ లేదు.. ఇటు గ్రామర్ లేదు. దాంతో ఆయన జనాలలోకి వెళ్తున్నా ఏమాత్రం స్పందన రావడం లేదని అంటున్నారు. లోకేష్ ని జిల్లాల టూర్లకు పంపించి భావి నాయకుడిగా ప్రోజెక్టు చేయాలని చంద్రబాబు అయితే తెగ ఉబలాట పడుతున్నారు.. కానీ చంద్రబాబు ఆలోచనలు, అయన ఆశలు తప్పు అని లోకేష్ బోసిపోయిన పర్యటనలు నిరూపిస్తున్నాయి. లోకేష్ వస్తున్నాడు అంటే టీడీపీ కేడర్ లో ఎక్కడా జోష్ కనిపించడం లేదు. పైగా ఆయన పరామర్శ యాత్రలు కూడా తేలిపోతున్నాయి. హడావుడి అంతా కూడా టిడిపి అనుకూల మీడియాలో తప్ప మరెక్కడా లేదనే చెప్పాలి. ( Chandrababu )

పార్టీ యువనేత.. భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతున్న నేత వస్తున్నాడంటే పర్యటన అంతా దద్దరిల్లి పోవాలి. కానీ నేతలకే ఆయన పర్యటనలు పట్టడం లేదు. ఇక మరోవైపు వైసీపీ దూకుడుగానే ఉంది. టిడిపిని ఈపాటికే టార్గెట్ చేసి చెక్ పెట్టేసింది. ఇప్పటికే ఆ పార్టీలో నోరు ఉన్న లీడర్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఎవరు గట్టిగా నోరు మెదిపితే ఎక్కడ చిక్కుల్లోపడతామో అన్న భయంతో ఉంటున్నారు.

అది చూసి మురిసిపోవడమే తప్ప

వారి తరుపున నిలబడిన లోకేష్, సర్కార్ కి ఇస్తున్న వార్నింగులు కూడా గాలి లోనే కలిసిపోతున్నాయి. వాటిని వైసిపి కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అస్సలు ఖాతరు చేయడం లేదు. నిజానికి ఈ సమయంలో చంద్రబాబు టూర్లు చేసి విమర్శలు చేసినా కూడా వైసిపి పెద్దల నుంచి నో రెస్పాన్స్ అన్నట్లుగానే ఉంది. దాంతో రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని లోకేష్ పెద్ద మాటలు మాట్లాడుతుంటే, చాలా బాగుంది అని అనుకూల మీడియాలో రాసుకుని మురిసిపోవడమే తప్ప.. ఇటు జనాలలో కానీ, అటు పార్టీలో కానీ వాటి impact అస్సలు కనిపించడం లేదు.

మొత్తానికి లోకేష్ తానున్నాను అంటూ క్యాడర్ ను దూకుడు పెంచమంటున్నారు. కానీ లోకేష్ భరోసా వారికి ఏమాత్రం కిక్కు ఇవ్వలేకపోతోంది. వచ్చేది మన ప్రభుత్వమే అని లోకేష్ ఎన్నిసార్లు చెప్పుకుంటున్నా, ఆ నమ్మకం కూడా పార్టీలో ఎక్కడా కనపడటం లేదు. అంటే చిన్నబాబు టూర్లు ఎన్ని వేసినా వేస్ట్ అని అర్థమైపోతుంది. ఏ ముహూర్తంలో RGV కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీసాడో కానీ అప్పటి నుంచి లోకేష్ తన పాత్రను చూపించినట్లే నిలబెట్టుకుంటున్నాడు. కాస్త కూడా డెవలప్ అయ్యే సూచనలు చూపించట్లేదు.

పంచ్ డైలాగ్స్ పనిచేస్తాయా

సినిమాలో బ్రహ్మానందంని చూస్తే నవ్వొచ్చినట్లుగా.. రాజకీయాల్లో లోకేష్ పరిస్థితి అలాగే ఉంది అధికార పార్టీ వర్గీయులకు. దానికి ప్రధాన కారణం అతనిలో వాక్పటిమ లేకపోవడమో, మరొకటో కాదు. కేవలం అహంకారపూరితమైన ఛాలెంజ్ డైలాగ్స్. ప్రతి ప్రెస్ మీట్ లోనూ పంచ్ డైలాగ్స్ కొట్టే పని పెట్టుకున్నాడు. తనికితాను హీరోగా ఫీల్ అవుతుంటాడు. కానీ ఆ సోకాల్డ్ పంచ్ లన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలు కొడుతున్నాయి.

ఓటర్లు కొడుతున్న దెబ్బలకి నిలబడలేక ఆ తర్వాత బొక్కబోర్లా పడ్డ పార్టీ ప్రస్తుతం కోమాలో ఉంది. ఇప్పుడు కావలసింది హీరోయిజం డైలాగ్ లు కాదు. జనం చేత హీరో అనిపించుకునే పనులు చేయాలి. ఎందుకంటే మాటలతో నెగ్గుకువచ్చే సత్తా ఎలాగో లేదు.. కనీసం చేతలతో అయినా వొళ్ళు వంచి కష్టపడాలి. జనంతో కలవాలి. నిత్యం పాదయాత్రలు చేయాలి. మజ్జిగ తాగి తీయగుంది.. ఇలాంటి కామెడీ విన్యాసాలు చేయకుండా సీరియస్ గా ప్రజల సమస్యలు తెలుసుకుని నోట్స్ రాసుకోవాలి. చేయగా చేయగా నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రధాన ప్రత్యామ్నాయంగా లోకేష్ కల్పించాలి. అప్పుడు గాని అధికారం కలలు నెరవేరవు.

పొత్తు లేకుండా ముందుకు ఎలా

తెలుగు ప్రజలు లెక్కల మాస్టర్ లాంటి వాళ్ళు. వారికి ప్రతి విషయంలోనూ ఒక లెక్క ఉంటుంది. 2014లో విభజన అయ్యాక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. అందుకే చంద్రబాబుకి పట్టం కట్టారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఉన్నది మోడీ వేవ్. ఆ పార్టీతో టిడిపికి పొత్తు, మొదలైనవి కూడా ఖచ్చితంగా పనిచేశాయి. భవిష్యత్తులో లోకేష్ లాంటి నాయకుడు రాష్ట్రానికి కావాలి అని జనం అనుకుంటే తప్ప మళ్లీ సైకిల్ వైపు చూడరు. అది అయ్యే పనేనా అంటే చాలా చాలా కష్టం. ( Lokesh meets Prashant Kishor )

లోకేష్ వయసులో ప్రస్తుత ముఖ్యమంత్రి కన్నా చిన్నవాడు. సరిగ్గా నిలబెట్టుకుంటే రాజకీయ భవిష్యత్తు చాలానే వున్నవాడు. తండ్రి కోరిక నెరవేరేలా ముఖ్యమంత్రి అవ్వాలంటే తనకు ఏది సూట్ అవుతుందో ఆ పనే చేయాలి. అంతేతప్ప సూట్ కానీ పంచ్ డైలాగ్స్ కాదు. జగన్ లాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే అతని కంటే ధైర్యంగా నిలబడాలి. అతని కంటే ఎక్కువగా పాదయాత్రలు చేయాలి. అతని కంటే ఎన్నో రెట్లు ప్రజాభిమానం మూటగట్టుకోవాలి. అంతేగాని అతన్ని ఒక శాడిస్టు గానో, ఫ్యాక్షనిస్టు గానో నిరూపించే విధంగా ప్రెస్ మీట్లు పెడతానంటే పని జరగదు. ఇలాంటి ప్రాథమిక సూత్రాలు చెప్పడానికి ఏ ప్రశాంత్కిషోరో, రాబిన్ శర్మలో అవసరం లేదు. జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇలా పనికిరాని మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్న లోకేష్ ను చూసి సొంత పార్టీ వాళ్ళే చిరాకు పడుతున్నారు.

1 thought on “పంచ్ డైలాగులతో పనులు కావు లోకేష్ బాబు”

Leave a Comment